BSE Sensex : భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 135.03 పాయింట్లు నష్టపోయి, 75,183.36 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా స్వల్పంగా.. అంటే 4.30 పాయింట్లు నష్టపోయి 23,789 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం ట్రేడింగ్ లాభాల్లోనే కొనసాగింది. సెన్సెక్స్ ఒకదశలో 500 పాయింట్లు పెరిగింది.
ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్ చివరికి నష్టాల్లో ముగిసింది. క్రూడాయిల్ ధరలు తగ్గడం, ఇరాన్‌తో చర్చలు జరుగుతాయని ట్రంప్ ప్రకటిండచడం ఉదయం మార్కెట్‌కు కలిసొచ్చింది. ఆర్బీఐ రేట్లు పెంచుతుందనే భయం, ద్రవ్యోల్బణం పెరుగుదల, అంతర్జాతీయ పరిణామాలు వంటివి మార్కెట్ నష్టాలకు కారణాలు. ఐటీ, ఎఎఫ్‌సీజీ షేర్లపై ఒత్తిడి పెరగడంతో మార్కెట్ ప్రభావితమైంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, హిందుస్తాన్ యునీలీవర్ షేర్లు నష్టపోయాయి. అల్ట్రాటెక్, ఇండిగో, అదానీ పోర్ట్స్, ట్రెంట్, బీఈఎల్ షేర్లు లాభాలు చవిచూశాయి.
నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.63 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర స్వల్పంగా తగ్గింది. బ్యారెల్ క్రూడాయిల్ ధర 104 డాలర్ల వద్ద కొనసాగింది. బంగారం ఔన్స్ ధర 4518 డాలర్ల వద్ద కొనసాగింది. మరోవైపు గురువారం రూపాయి స్వల్పంగా లాభపడింది. డాలర్‌తో రూపాయి 63 పైసలు బలపడి 96.23కు చేరింది.