stock market : భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన ట్రేడింగ్ చివరికి అమ్మకాల ఒత్తిడి కారణంగా భారీనష్టాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,092.06 పాయింట్లు (1.44 శాతం) నష్టపోయి 74,775.74 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 76,220.02 పాయింట్ల గరిష్టాన్ని తాకినప్పటికీ చివరికి నష్టాల్లో ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 359.40 పాయింట్లు (1.50 శాతం) నష్టపోయి 23,547.75 వద్ద ముగిసింది. దేశంలో ఇన్వెస్టర్ల సంపద ఈ ఒక్కరోజే దాదాపు రూ.5 లక్షల కోట్లు నష్టపోయింది. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ.466 లక్షల కోట్లుగా ఉంది. దేశంలో రుతుపవనాల రాక ఆలస్యం కానుందనే వార్తలు, అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొలిక్కి రాకపోవడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు. దేశంలో రుతపవనాలు ఆలస్యమైతే వర్షాలు సరిగ్గా కురవవు. దీనివల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం మార్కెట్‌ను దెబ్బతీసింది.
సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాలు చవిచూడగా, మిగతా షేర్లు భారీగా నష్టపోయాయి. వాటిలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు ఎక్కువగా నష్టాలు చవిచూశాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారక విలువ 95.05గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల ధర 91.40 డాలర్లుగా ఉంది. బంగారం ఔన్స్ ధర 4530 డాలర్ల వద్ద కొనసాగుతోంది.