న్యూఢిల్లీ, జూలై 30 : నేర చరిత్ర కలిగినవారు తప్ప..మిగిలినవారిపై చట్టపరమైన చర్యలుండవన్న ఢిల్లీ ప్రభుత్వం..అప్పుడే మాట తప్పింది! పేపర్ లీక్ నిరసనల్లో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 25 ఏండ్ల యువతిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రధాని మోదీని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు రుచికా సింగ్ అనే యువతిపై చట్టపరమైన చర్యలకు దిగారు.
జూలై 23న జంతర్ మంతర్ వద్ద రుచికా సింగ్ చేసిన వ్యాఖ్యలపై బుధవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమె వ్యాఖ్యలు ప్రధానమంత్రి కార్యాలయం గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని, అశాంతిని వ్యాప్తి చేసి శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశముందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. దీనిపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ అధికారులు తదుపరి విచారణ చేపట్టారు.