భద్రాచలం/ దుమ్ముగూడెం/ చర్ల, జూలై 30 : ఎగువన కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం 29 అడుగులకు చేరి, సాయంత్రం నుంచి తగ్గుముఖం పట్టింది. బుధవారం రాత్రి 16.30 అడుగుల వద్ద ప్రవహించి, గురువారం ఉదయం 6 గంటలకు 25.40 అడుగులకు చేరింది. ఉదయం 9 గంటలకు 27.40, 11 గంటలకు 28.30 అడుగులకు, మధ్యాహ్నం 12 గంటలకు 29 అడుగులకు చేరుకొని సాయంత్రం 4 గంటల వరకు నిలకడగా ఉంది.
రాత్రి 8 గంటలకు 28.50 అడుగులకు తగ్గి నిలకడగా ప్రవహిస్తోంది. అయితే ఎగువన వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున అర్ధరాత్రి దాటిన తర్వాత గోదావరి మళ్లీ నెమ్మదిగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద 13.5 అడుగుల వద్ద నీటి ప్రవాహం ఉంది. కాగా, రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. అప్రమత్తమైన అధికారులు గురువారం నుంచి 13 గేట్లు 2 అడుగుల మేర, 2 గేట్లు పూర్తిగా ఎత్తి 29,174 క్యూసెకుల నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి స్వల్పంగా నీటి ప్రవాహం వస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇంద్రావతి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. దీంతో ఆ రాష్ట్రంలోని పాతగూడ వద్ద నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. దీంతో భద్రాచలం వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుంచి గోదావరి వరద క్రమేపి పెరగనున్నది. సాయంత్రం వరకు తొలి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించే అవకాశం ఉన్నదని నీటిపారుదల శాఖ అధికారులు అందనా వేస్తున్నారు. కాగా, భద్రాచలం డివిజన్లో వరద పరిస్థితిని కేంద్ర జల సంఘం, నీటిపారుదల శాఖ అధికారులతో సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట పర్యవేక్షిస్తున్నారు.