KTR | భారత అంతరిక్ష రంగంలో హైదరాబాద్, తెలంగాణకు చెందిన స్టార్టప్ సంస్థలు సత్తా చాటడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా పలు భారతీయ స్పేస్‌టెక్ స్టార్టప్‌లకు చెందిన పేలోడ్లు విజయవంతంగా కక్ష్యలోకి చేరడంపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ధ్రువ స్పేస్, టేక్‌మీ2స్పేస్, శాట్లియో ల్యాబ్స్, ఈయాన్ స్పేస్ ల్యాబ్స్ సంస్థలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ నాలుగు సంస్థల్లో మూడు తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో భాగమవడం గర్వకారణమని పేర్కొన్నారు. టీ-హబ్, టీ-వర్క్స్ వంటి సంస్థల ద్వారా తెలంగాణలోని స్టార్టప్ వ్యవస్థకు లభిస్తున్న ప్రోత్సాహం ఇందుకు దోహదపడుతోందన్నారు.
హైదరాబాద్‌కు చెందిన టేక్‌మీ2స్పేస్ సంస్థ ఇటీవల తన ఎంవోఐ-1ఏ (MOI-1A) ఉపగ్రహాన్ని స్పేస్ఎక్స్ ట్రాన్స్పోర్టర్-18 మిషన్ ద్వారా కక్ష్యలోకి పంపింది. ఈ ఉపగ్రహం ప్రత్యేకత.. అంతరిక్షంలోనే సేకరించిన డేటాను కృత్రిమ మేధ (AI) సాయంతో విశ్లేషించగలగడం. సాధారణంగా ఉపగ్రహాలు సేకరించిన చిత్రాలు, డేటాను ముందుగా భూమికి పంపిన తర్వాత విశ్లేషిస్తారు. అయితే ఆర్బిటల్ కంప్యూటింగ్ సాంకేతికతతో అవసరమైన డేటాను ఉపగ్రహంలోనే గుర్తించి భూమికి పంపే విధానం అందుబాటులోకి వచ్చింది.
దీంతో భారీ మొత్తంలో సేకరించిన డేటాలో అవసరం లేని సమాచారాన్ని పంపకుండా, ఉపయోగకరమైన సమాచారాన్ని మాత్రమే భూమికి పంపవచ్చని సంస్థ తెలిపింది. ఉదాహరణకు ఉపగ్రహం వందల జీబీ డేటాను సేకరించినా.. అందులో అవసరమైన భాగాన్ని ఏఐ గుర్తించి పంపగలదు. తద్వారా డేటా ప్రసారానికి పట్టే సమయం, ఖర్చు తగ్గే అవకాశం ఉంది.
వరదలు, అడవులు, పంటలు, గనుల ప్రాంతాలు, సరిహద్దులు, భూభాగాల పర్యవేక్షణ వంటి రంగాల్లో ఈ సాంకేతికతను ఉపయోగించవచ్చని సంస్థ వెల్లడించింది. తెలంగాణకు చెందిన స్పేస్‌టెక్ స్టార్టప్‌లు అంతర్జాతీయ స్థాయిలో తమ సాంకేతిక సామర్థ్యాన్ని చాటుకోవడం రాష్ట్ర స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ప్రాధాన్యాన్ని పెంచుతోంది.