భువనేశ్వర్: దేశంలో మరో ప్రశ్న పత్రం లీక్ అయ్యింది! బీజేపీ పాలిత ఒడిశాలో గత సోమవారం నాటి పీజీ మెడికల్ ఎగ్జామ్‌కు సంబంధించి ప్రశ్నపత్రం ఫొటోలు సోషల్‌మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థి ఒకరు వాట్సాప్ ఫొటోల్ని బయటపెట్టడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఈ ఉదంతంపై ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అంతర్గత విచారణకు ఆదేశించినట్టు సంబంధిత అధికారులు గురువారం మీడియాకు తెలిపారు.
2023-26 ఎంఎస్, ఎండీ బ్యాచ్‌కు సంబంధించి జూలై 27న నిర్వహించిన జనరల్ సర్జరీ థియరీ పరీక్షల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ప్రశ్నపత్రం ఫొటోలు వాట్సాప్‌లో విడుదలయ్యాయి. పరీక్ష జరుగుతుండగానే కొన్ని ఫోన్ నంబర్ల నుండి సమాధానాలు కూడా వెళ్లాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎంకేసీజీ మెడికల్ కాలేజీ డీన్ దలాల్ మాట్లాడుతూ, ‘ఇది ప్రశ్నపత్రం లీకేజ్ కాదు. బయటకు రహస్యంగా తీసుకెళ్లడం’ అని అన్నారు.