Investors Wealth | అంతర్జాతీయంగా బలహీనతలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో దేశీయ స్టాక్ మార్కెట్లలో గత ఐదు సెషన్లలో ఇన్వెస్టర్లు రూ.18.43 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయారు. గత ఐదు రోజుల్లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 4091.53 పాయింట్లు (4.98 శాతం0 నష్టపోయింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,43,121.27 కోట్లు కోల్పోయి రూ.4,40,99,217.32 కోట్లకు చేరింది. శుక్రవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1,176.46 పాయింట్లు నష్టపోయి 78,041.59 పాయింట్ల వద్ద ముగిసింది.
బీఎస్ఈ సెన్సెక్స్-30 ఇండెక్సులో టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), లార్సెన్ అండ్ టర్బో, ఆల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ భారీగా నష్టపోయాయి. నెస్లే ఇండియా, టైటాన్ స్టాక్స్ లాభ పడ్డాయి. అంచనాలకు భిన్నంగా యూఎస్ ఫెడ్ రిజర్వు.. రెండు సార్లు మాత్రమే వడ్డీరేట్ల తగ్గింపు ఉంటుందని ప్రకటించడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది.