Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రాల ఆర్థిక వృద్ధికి ప్రాణం పోసే మూలధన వ్యయంపై పార్లమెంట్ ఎన్నికలు తీవ్ర ప్రభావం చూపించాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని గణనీయంగా తగ్గించాయి. గత తొలి త్రైమాసికంతో పోలిస్తే ఏపీ 88.7 శాతం, తెలంగాణ 40.4 శాతం పెట్టుబడి వ్యయాన్ని కుదించాయి.
పెద్దమొత్తంలో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) కలిగిన 15 రాష్ర్టాలకుగాను 10 రాష్ర్టాలు తొలి త్రైమాసికంలో పెట్టుబడుల ఖర్చులకు పెద్దమొత్తంలో కోతలు పెట్టాయి. పార్లమెంట్ ఎన్నికల కారణంగా పెట్టుబడుల వ్యయాన్ని ఆయా రాష్ర్టాలు భారీగా తగ్గించినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన డాటా విశ్లేషణలో వెల్లడైంది.
ఆంధ్రప్రదేశ్లో 2023 జూన్ నాటికి పెట్టుబడుల ఖర్చు రూ.12,495 కోట్ల నుంచి 2024 జూన్ నాటికి రూ.1,417 కోట్లకు.. అంటే 88 శాతం తగ్గింది. తెలంగాణలో 2023 జూన్ నాటికి రూ.9,817 కోట్ల నుంచి 2024 జూన్ నాటికి రూ. 5,854 కోట్లకు.. అంటే 40 శాతం తగ్గుదల నమోదైంది. గుజరాత్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో కూడా పెట్టుబడుల ఖర్చులో గణనీయమైన తగ్గుదల కనిపించింది. 2024 మొదటి త్రైమాసికం నాటికి రాష్ట్రాల పెట్టుబడుల ఖర్చు బడ్జెట్ నిష్పత్తి.. 5 శాతం నుంచి 20 శాతం మధ్యనే ఉన్నది.
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు బడ్జెట్లో కేటాయించిన నిష్పత్తుల కంటే పెట్టుబడుల ఖర్చులో తకువ శాతం నమోదు చేశాయి. మొదటి త్రైమాసికంలో 27 రాష్ట్రాల మొత్తం మూలధన వ్యయం గత సంవత్సరం కంటే గణనీయంగా తగ్గింది. జూలై నెలలో మాత్రం 6.8 శాతం పెరుగుదల నమోదైంది. 2019 ఎన్నికల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో రాష్ట్రాల మూలధన వ్యయం 6.5 శాతం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తన మూలధన వ్యయంలో 35 శాతం కోత విధించింది.
రాష్ర్టాల్లో పెట్టుబడుల వ్యయం తగ్గుదలకు ప్రధాన కారణం సార్వత్రిక ఎన్నికలు అని ఆర్థిక నిపుణుడు సుజన్ హజ్రా అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితి రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి ధోరణి కనిపించిందని తెలిపారు. రాష్ట్రాల మూలధన వ్యయంలో తగ్గుదల రాష్ట్రాల అభివృద్ధిని పెద్ద ఎత్తున దెబ్బతీస్తుందని, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు సృష్టి, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఆంధ్రప్రదేశ్: -88.7%
తెలంగాణ: -40.4%
గుజరాత్: -25.5%
ఛత్తీస్గఢ్: -19.0%
హర్యానా: -17.0%
మధ్యప్రదేశ్: -15.2
ఉత్తరప్రదేశ్: -12.6%
కేరళ: -8.4%
బీహార్: -5.2%
తమిళనాడు: -3.0%
ఒడిశా: +3.6%
మహారాష్ట్ర: +17.2%
పంజాబ్: +92.3%
అస్సాం: +126.0%
కర్ణాటక: +134.5%
(జూన్ 2023 నుంచి జూన్ 2024 వరకు వృద్ధి శాతాలు)