న్యూఢిల్లీ/హైదరాబాద్, నవంబర్ 16: కో-వర్కింగ్ దిగ్గజం వుయ్‌వర్క్ ఇండియా.. హైదరాబాద్, బెంగళూరుల్లో భారీ ఎత్తున ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్నది. 2.72 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని పొందినట్టు గురువారం ఆ సంస్థ తెలియజేసింది. ఆయా నగరాల్లోని ఈ ఆఫీస్ స్పేస్‌లో రెండు కొత్త కో-వర్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, వీటిలో దాదాపు 4,000 డెస్క్లుంటాయని పేర్కొన్నది. హైదరాబాద్‌తోపాటు న్యూఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ముంబై, బెంగళూరు, పుణె నగరాల్లో ఇప్పటికే సంస్థకు సెంటర్లున్నాయి. ఈ నగరాల్లోని 50 ప్రాంతాల్లో 65 లక్షలకుపైగా చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్ వుయ్‌వర్క్ సొంతం.
2017లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించిన వుయ్‌వర్క్.. హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో విస్తరిస్తున్నది. అయితే దక్షిణాది విపణిపై దృష్టి పెట్టిన సంస్థ.. రాష్ట్ర రాజధాని నగరంలో అవకాశాలకు తగ్గట్టు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కొత్త కో-వర్కింగ్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధమైంది. బెంగళూరు కంటే పెద్దదిగా, 1.54 లక్షల చదరపు అడుగుల్లో హైదరాబాద్ కేంద్రం రానుండటం గమనార్హం. ఇందులో 2,220 డెస్కులుండనున్నాయి. బెంగళూరులో 1.17 లక్షల చదరపు అడుగుల్లో వుయ్‌వర్క్ కొత్త సెంటర్ వస్తుండగా, అక్కడ 1,700లకుపైగా డెస్కులుంటాయని కంపెనీ వర్గాలు చెప్తున్నాయి.
హైదరాబాద్‌లోని ఆర్ఎంజెడ్ స్పైర్లో ఈ 1.54 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను వుయ్‌వర్క్ లీజుకు తీసుకున్నది. ఈ మేరకు లీజు ఒప్పందం జరిగినట్టు వుయ్‌వర్క్ తెలియజేసింది. అలాగే బెంగళూరులోని మాన్యతా రెడ్వుడ్లో 1.17 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని పొందామని, లీజ్ అగ్రిమెంట్‌పై సంతకాలు కూడా ముగిశాయని వివరించింది. ఇదిలావుంటే వుయ్‌వర్క్ గ్లోబల్.. అమెరికా కోర్టులో ఇటీవల దివాళా ప్రక్రియకు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రభావం తమపై ఉండబోదని వుయ్‌వర్క్ ఇండియా స్పష్టం చేసిన సంగతీ విదితమే. వుయ్‌వర్క్ ఇండియాలో 73 శాతం వాటా బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూప్నకున్నది. వుయ్‌వర్క్ గ్లోబల్కున్న వాటా 27 శాతమే. దీంతో ఏ రకంగానూ వుయ్‌వర్క్ గ్లోబల్ దివాళా.. వుయ్‌వర్క్ ఇండియా కార్యకలాపాలను దెబ్బ తీయబోదని ఎంబసీ గ్రూప్ చెప్తున్నది.
కరోనా దెబ్బకు వర్క్ ఫ్రమ్ హోం బాట పట్టిన కంపెనీలన్నీ.. తిరిగి ఆఫీసులను తెరుస్తున్నాయిప్పుడు. దీంతో ఆఫీస్ స్పేస్‌కు మళ్లీ డిమాండ్ కనిపిస్తున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 ప్రధాన ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లున్నారు. ఇందులో టాప్-10 ఆపరేటర్లదే మార్కెట్లో 84 శాతం వాటా అని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ చెప్తున్నది. కాగా, ‘ఫ్లెక్సింగ్ ది వర్క్‌స్పేస్-బ్యాక్ టు ఆఫీస్’ పేరిట ఇటీవల విడుదల చేసిన నివేదికలో దేశంలోని ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్ల వద్దనున్న వెయ్యికిపైగా కేంద్రాల్లో 7.6 లక్షలకుపైగా డెస్కులు అందుబాటులో ఉన్నాయని వెస్టియన్ ప్రధానంగా పేర్కొన్నది.
కాగా, డెడికేటెడ్ డెస్కులు, హాట్ డెస్కింగ్, కో-వర్కింగ్ స్పేసెస్, సర్వీస్డ్-మేనేజ్డ్ ఆఫీస్ స్పేసెస్నే ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌లుగా అభివర్ణిస్తున్నారు. దేశీయంగా వుయ్‌వర్క్ ఇండియాతోపాటు స్మార్ట్‌వర్క్స్, సింప్లీవర్క్ ఆఫీసెస్, ఆఫీస్, టేబుల్ స్పేస్, స్కూటర్, ది ఎగ్జిక్యూటివ్ సెంటర్, అర్బన్ వాల్ట్, ఇండీక్యూబ్, ఇంక్యూస్పేజ్, 91స్ప్రింగ్‌బోర్డ్, 315 వర్క్ అవెన్యూ, ఆకాశ కోవర్కింగ్, దీ ఆఫీస్ పాస్, అవంతా ఇండియా, బిహైవ్ వర్క్‌స్పేస్ వంటివి కో-వర్కింగ్ ఆఫీస్ స్పేస్ కంపెనీలుగా ఉన్నాయి.