Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ఇన్వెస్టర్లు, స్టాక్స్ మధ్య దోబూచులాట కొనసాగింది. శుక్రవారం ఉదయం ప్రారంభంలో నష్టాలతో మొదలైన స్టాక్స్ ట్రేడింగ్.. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలతో స్థిర పడింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్-30 843.15 పాయింట్ల లబ్ధితో 82,133.12 కోట్లకు చేరుకున్నది. మరోవైపు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 219.60 పాయింట్ల లాభంతో 24,768.30 పాయింట్ల వద్ద ముగిసింది.
బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 81 వేల దిగువకు పడిపోయి 80,712.63 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 24,382.40 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. నిఫ్టీ బ్యాంక్ 375 పాయింట్లు నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంకు, మెటల్, ఫైనాన్సియల్, ప్రైవేట్ బ్యాంక్, ఆటో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
నిఫ్టీలో భారతీ ఎయిర్ టెల్, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఐటీసీ షేర్లు లాభాలతో ముగిశాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్ తదితర స్టాక్స్ అమ్మకాల ఒత్తిడితో నష్టాలతో స్థిర పడ్డాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్, బీఎస్ఈ మిడ్ క్యాప్ ఫ్లాట్‌గా ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, టెలికం ఇండెక్స్‌లు లాభ పడ్డాయి. మెటల్, మీడియా ఇండెక్స్‌లు 0.5 శాతం వరకూ నష్టపోయాయి.