ముంబై, నవంబర్ 11: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ).. గృహ రుణాలపై శుక్రవారం వడ్డీరేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్లు (పావు శాతం) తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో హోమ్ లోన్లపై బ్యాంక్ వడ్డీరేటు 8.25 శాతానికి దిగింది. అంతేగాక ఈ పరిమితకాల ఆఫర్ కింద ప్రాసెసింగ్ ఫీజును కూడా రద్దు చేస్తున్నట్టు బ్యాంక్ ఈ సందర్భంగా ప్రకటించింది. ఇదిలావుంటే హోమ్ లోన్ మార్కెట్లో ప్రధాన సంస్థలైన ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ కంటే కూడా బీవోబీ వడ్డీరేటు ఇప్పుడు తక్కువగా ఉండటం గమనార్హం.
ఈ రెండు సంస్థల్లో గృహ రుణాలపై కనిష్ఠ వడ్డీరేటు 8.4 శాతంగా ఉన్నది. కాగా, సవరించిన వడ్డీరేటు రాబోయే సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని బీవోబీ తెలియజేసింది. అలాగే ఈ స్పెషల్ రేటు డిసెంబర్ ఆఖరుదాకానే అందుబాటులో ఉంటుందని బీవోబీ మార్ట్గేజ్, రిటైల్ ఆస్తుల విభాగం జనరల్ మేనేజర్ హెచ్టీ సోలంకి స్పష్టం చేశారు. ఇతర బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి గృహ రుణాలను తమ బ్యాంకుకు మార్చుకునే కస్టమర్లకూ ఈ తక్కువ వడ్డీరేటు ఉంటుందని చెప్పారు. అయితే క్రెడిట్ స్కోర్ బాగుంటేనే వర్తిస్తుందన్నారు.