దేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామంటూ గద్దెనెక్కిన మోదీ సర్కారు.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడం, ప్రైవేట్ రంగ కంపెనీలపై కఠిన వైఖరి ప్రదర్శించడమే పరమావధిగా పాలిస్తున్నది.
ఫలితంగా దేశవ్యాప్తంగా లక్షలాది కంపెనీలు మూతబడుతున్నాయి. మేకిన్ ఇండియా అంటూ ఊదరగొడుతున్న పాలకపక్షం.. చివరకు తమవారిగా ముద్రపడ్డ కార్పొరేట్లకే పట్టం కడుతున్నది. అన్ని రంగాల్లోనూ వారికే అగ్రతాంబూలం ఇస్తున్నది.
ప్రభుత్వం నుంచి సరైన చేయూత లేకపోవడంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు, స్టార్టప్‌ల మనుగడ కష్టంగా మారిపోతున్నది. ఏటా మార్కెట్‌కు దూరమవుతున్న కంపెనీల్లో ఇవే ఎక్కువగా ఉంటుండగా, వీటిలోని ఉద్యోగులు ఉపాధి కరువై రోడ్డునపడుతున్నారు.
న్యూఢిల్లీ, జూలై 22 : వ్యాపార, వాణిజ్య రంగాల్లో కేంద్ర ప్రభుత్వం తీరు.. కంపెనీల పాలిట శాపంలా పరిణమిస్తున్నది. పార్లమెంట్ సాక్షిగా మంత్రులు ప్రకటిస్తున్న గణాంకాలే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. ఏటా ఇన్ని వేల కంపెనీలు మూతబడ్డాయని, అన్ని వందల విదేశీ సంస్థలు దేశం విడిచి వెళ్లిపోయాయని చెప్తుండటం.. భారతీయ పారిశ్రామిక రంగంలో నెలకొన్న విపత్కర పరిస్థితులకు అద్దం పడుతున్నది మరి. 2020 జూలై 1 నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు గడిచిన ఐదేండ్లలో దేశవ్యాప్తంగా 75,082 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లు మూతబడినట్టు ఆ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పార్లమెంట్లో చెప్పారు. దీనివల్ల లక్షలాది మంది నిరుద్యోగుల య్యారన్నదీ అంతే నిజం.
కొత్త లక్ష్యాలతో, సరికొత్త ఆలోచనలతో వచ్చే స్టార్టప్‌లకూ తగిన సహకారం దక్కడం లేదు. నిజానికి ఈ స్టార్టప్‌లు నిలదొక్కుకునేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండతోనే. అప్పుడే వారి ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చేది. కానీ 2023లో 15,921, 2024లో 12,717 స్టార్టప్‌లు మూతబడ్డాయి. వీటిలో కొన్ని దివాలా తీస్తే.. మరికొన్ని సరైన వ్యాపారంలేక చతికిలపడ్డాయి. వాస్తవానికి అంతకుముందు మూడేండ్లలోనూ స్టార్టప్‌లు షట్‌డౌన్ అయ్యాయి. అయితే 2019-2022 మధ్య వాటి సంఖ్య 2,300గానే ఉన్నది. కానీ 2023-2024లో 12 రెట్లు పెరిగిపోయింది. అంతేగాక గత ఏడాది కొత్త స్టార్టప్‌లు 5,264 మాత్రమే. అంతకుముందు ఏడాది 9,600గా ఉండటం గమనార్హం. ఇలా ఏటేటా వచ్చే కొత్త స్టార్టప్‌లు రావడం లేదు.. ఉన్న స్టార్టప్‌లు నిలదొక్కుకోవడమూ లేదు. మొత్తానికి ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తల కలలు కల్లలే అవుతున్నాయి. ఇందుకు కారణం వ్యవస్థీకృత లోపాలేనన్న విమర్శలు అంతటా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఇకనైనా ఆలోచిస్తే.. రేపటి తరాల్లో కొంతైనా ఉత్సాహం ఉంటుందంటున్నారు.
మోదీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలాపాలు పరిమితమైపోయాయి. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచే ప్రైవేటీకరణపై బీజేపీ సర్కారు దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే 2014-15లో ప్రభుత్వ రంగ సంస్థల మూలధన వ్యయం రూ.1.29 లక్షల కోట్లుగానే ఉన్నది. 2013-14లో రూ.1.69 లక్షల కోట్లు. ఏడాదిలో 23.5 శాతం క్షీణించింది. ఇక 2014లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య.. ప్రస్తుతం 12కు తగ్గింది. చాలా బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో విలీనమైపోయాయి. ఐడీబీఐ వంటి మరికొన్నింటిలో వాటాల విక్రయానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలావుంటే సర్కారీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.. టాటాల వశమైంది. అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ పెట్టుబడులపై ఏ స్థాయి రగడ జరిగిందో తెలిసిందే. గత 11 ఏండ్లలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణల ద్వారా రూ.5 లక్షల కోట్లదాకా నిధులను సమీకరించింది. మిగిలిన ప్రభుత్వ సంస్థల నుంచి, చివరకు రిజర్వ్ బ్యాంక్ నుంచీ డివిడెండ్ల రూపంలో బాగానే రాబట్టింది. మొత్తానికి కంపెనీలపట్ల సర్కారు వైఖరిపై విమర్శలు గట్టిగానే వస్తున్నా.. పాలకపక్షం ఒంటెత్తు పోకడ మాత్రం ఆగడం లేదు.