BSE Sensex : భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 516 పాయింట్లు నష్టపోయింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్లలో భారీ అమ్మకాల ప్రభావం మార్కెట్‌పై పడింది. దీంతో మార్కెట్ నష్టాలు చవిచూసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 516.33 పాయింట్ల నష్టంతో 77,328.19 వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 150.50 పాయింట్ల నష్టంతో 24,176.15 వద్ద ముగిసింది. ఎస్బీఐ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఏకంగా 6.74 శాతం వరకు ఎస్బీఐ షేర్లు నష్టపోయాయి. నాలుగో త్రైమాసిక ఫలితాలు.. అంచనాలకు అందకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఎస్బీఐ.. స్టాక్ మార్కెట్లో లిస్టైన దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. ఈ ఒక్క రోజే ఎస్బీఐ మార్కెట్ విలువ రూ.67,932 కోట్లు నష్టపోయింది. ఎస్బీఐతోపాటు హెచ్డీఎఫ్సీ షేర్లు 1.89 శాతం, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 1.76 శాతం, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 1.88 శాతం, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు 1.24 శాతం నష్టపోయాయి.
కోల్ ఇండియా, ఓఎన్జీసీ, అల్ట్రా టెక్ సిమెంట్ కంపెనీల షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్తితులు మళ్లీ పెరిగిన సంగతి తెలిసిందే. అమెరికా–ఇరాన్ మధ్య దాడులు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో అంతర్జాతీయంగా అనేక మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.47 వద్ద ముగిసింది.