అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆవరించిన భయాలు.. ప్రపంచ మార్కెట్లను వణికించాయి. సోమవారం భారత్‌సహా ప్రధాన ఆసియా, ఐరోపా మార్కెట్లు కుప్పకూలాయి. మదుపరులు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు తెగబడ్డారు. దీంతో అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 2,222.55 పాయింట్లు పతనమై 80వేల మార్కుకు దిగువన 78,759.40 వద్దకు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 662.10 పాయింట్లు క్షీణించి 24,055.60 వద్దకు దిగజారింది. దీంతో జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల దెబ్బకు మార్కెట్ కుదేలైన తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ నష్టా లను చవిచూసింది. ఒక్కరోజే రూ.15.32 లక్షల కోట్ల మదుపరుల సంపద హరించుకుపోయింది.
Stock Markets | ముంబై, ఆగస్టు 5: దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్ మొదలు.. మధ్యాహ్నం ముగిసే వరకు మదుపరులు అమ్మకాలకే పెద్దపీట వేశారు. మాంద్యం గుప్పిట్లోకి అగ్రరాజ్యం అమెరికా పోనున్నదన్న అంచనాలు.. మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. అలాగే ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధ మేఘాలు, ఇతరత్రా కారణాలూ ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,222.55 పాయింట్లు లేదా 2.74 శాతం కోల్పోయి 80వేల మార్కుకు దిగువన 78,759.40 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 2,686.09 పాయింట్లు లేదా 3.31 శాతం పడిపోవడం గమనార్హం. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 662.10 పాయింట్లు లేదా 2.68 శాతం దిగజారి 24,055.60 వద్ద నిలిచింది. ఇంట్రా-డేలో 824 పాయింట్లు లేదా 3.33 శాతం క్షీణించింది. అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ రెండింటికీ జూన్ 4 తర్వాత ఇదే అతిపెద్ద నష్టం. శుక్రవారం కూడా సెన్సెక్స్ 886, నిఫ్టీ 293 పాయింట్లు పతనమైన విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన దేశాల స్టాక్ మార్కెట్లలో అలజడి చెలరేగింది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు పెద్ద ఎత్తున క్షీణించాయి. ముఖ్యంగా జపాన్ సూచీ నికీ 12.4 శాతం పడిపోయింది. మునుపెన్నడూ లేనివిధంగా 4,451.28 పాయింట్లు దిగజారి 31,458.42 వద్ద స్థిరపడింది. 1987 అక్టోబర్ 19న 3,836 పాయింట్లు నష్టపోయింది. ఇప్పటిదాకా నికీకి ఇదే భారీ నష్టం. అమెరికా ఉద్యోగ గణాంకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అగ్రరాజ్యం మాంద్యం కోరల్లో చిక్కుకోనుందన్న భయాలు అంతటా వ్యాపించాయి. ఇది మదుపరులను పెట్టుబడుల ఉపసంహరణ దిశగా నడిపించింది. అటు ఐరోపా మార్కెట్లదీ ఇదే పరిస్థితి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు నేలచూపుల్నే చూస్తున్నాయి. ఇక అమెరికా సూచీలు పెద్ద ఎత్తున క్షీణిస్తున్నాయి.
బ్యాంకింగ్, ఐటీ, మెటల్, చమురు-గ్యాస్ రంగాల షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొన్నది. నిజానికి అన్ని రంగాల సూచీల్లో సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. సేవా రంగం 4.56 శాతం, యుటిలిటీస్ 4.30 శాతం, రియల్టీ 4.25 శాతం, క్యాపిటల్ గూడ్స్ 4.13 శాతం, ఇండస్ట్రియల్స్ 4.08 శాతం, విద్యుత్తు 3.91 శాతం, చమురు-గ్యాస్ 3.88 శాతం, కమోడిటీస్ రంగ షేర్లు 3.82 శాతం చొప్పున
నష్టపోయాయి. టాటా మోటర్స్ షేర్ల విలువ గరిష్ఠంగా 7 శాతానికిపైగా పడిపోయింది. ఇక బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 4.21 శాతం, మిడ్‌క్యాప్ 3.60 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈలో 3,414 షేర్లు నష్టాలకే పరిమితమయ్యాయి. 664 షేర్లు లాభపడగా,
111 షేర్లు యథాతథంగా ఉన్నాయి.
స్టాక్ మార్కెట్ల నష్టాలతో మదుపరులు లక్షల కోట్ల రూపాయల్లో కోల్పోవాల్సి వచ్చింది. బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే రూ.15.32 లక్షల కోట్లు హరించుకుపోయింది. అంతకుముందు శుక్రవారం కూడా నష్టాలు వాటిల్లగా ఈ రెండు రోజుల్లో మదుపరులు చేజార్చుకున్న సంపద విలువ రూ.19.78 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.4,41,84,150.03 కోట్లు (5.27 ట్రిలియన్ డాలర్లు)గా ఉన్నది. ఈ ఒక్కరోజే రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.70,195 కోట్లు, టాటా మోటర్స్ మార్కెట్ విలువ రూ.42,461 కోట్లు ఆవిరైపోయింది.
2024 జూన్ 4న 4,389.73
2020 మార్చి 23న 3,934.72
2020 మార్చి 12న 2,919.26
2020 మార్చి 16న 2,713.41
2022 ఫిబ్రవరి 24న 2,702.15
2024 ఆగస్టు 5న 2,222.55
2020 మే 4న 2,002.27
2020 మార్చి 9న 1,941.67
2021 ఫిబ్రవరి 26న 1,939.32
2022 ఫిబ్రవరి 14న 1,747.08
బీఎస్ఈ అనుబంధ విభాగం ఆసియా ఇండెక్స్ సోమవారం సెన్సెక్స్ నెక్స్ 30 పేరిట ఓ కొత్త సూచీని ప్రకటించింది. ఇది సెన్సెక్స్‌లో లేని బీఎస్ఈ టాప్-100 స్టాక్స్ పనితీరును ట్రాక్ చేయనున్నది. ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్జ్యూమర్ డిస్క్రియేషనరీ, ఎనర్జీ, కమోడిటీస్, హెల్త్‌కేర్, ఇండస్ట్రీస్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, యుటిలిటీస్ షేర్లు కొత్త ఇండెక్స్‌లో ఉంటాయి.
అమెరికాలో తలెత్తిన మాంద్యం భయాలు.. ప్రపంచ మార్కెట్లలో పెను ప్రకంపనల్నే సృష్టించాయి. జపాన్ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాలతో కరెన్సీ మార్కెట్లో ఆ దేశ కరెన్సీ యెన్ విలువ పెరిగింది. రక్షణాత్మక ధోరణిని అవలంభిస్తున్న ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల క్రాష్‌కు కారకులయ్యారు.
-వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్
అమెరికాలో జూలై ఉద్యోగ గణాంకాల నివేదిక.. అక్కడ మాంద్యం సంకేతాలను మార్కెట్లోకి పంపించింది. భౌ గోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈక్విటీ మా ర్కెట్లను కుప్పకూల్చాయి. ఇజ్రాయెల్-హమాస్ పోరులో ఇరాన్, అమెరికా జోక్యం.. పరిస్థితుల్ని మరింతగా దిగజార్చాయి.
-అజిత్ బెనర్జీ, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కో