హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు విలువలను జోడించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు నేటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ముందుకు సాగడం లేదు. ఆయా జోన్లలో మౌలిక సదుపాయాలు కల్పించి కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే ఎక్కడికక్కడే వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేయవచ్చు. కానీ కాంగ్రెస్ సర్కారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కంపెనీలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల కోసం జిల్లాల వారీగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు ఏడు వేల ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని సిద్ధం చేసింది. ఎక్కడ పండే వ్యవసాయ ఉత్పత్తులను అక్కడే ప్రాసెస్‌చేసి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటుచేసింది.
భూసేకరణ ద్వారా రైతులను ఇబ్బందులు పెట్టకూడదనే ఉద్దేశంతో 7,149 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించి టీజీఐఐసీకి అప్పగించింది. రైస్ మిల్లులు, పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, మిల్లెట్స్, పంచదార, వంటనూనెలు, డెయిరీ ఉత్పత్తులు, వివిధ రకాల పానీయాలు ఉత్పత్తిచేసే పరిశ్రమలకు ఈ భూములను కేటాయించాలని నిర్ణయించారు. తద్వారా రైతులకు ప్రయోజనం కలగడమే కాకుండా స్థానిక గ్రామీణ యువతకు ఉపాధి లభిస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు అందే అవకాశం కనిపించకపోవడం, సబ్సిడీలపై ఇంతవరకు ఎటువంటి ప్రకటనలు వెలువడకపోవడంతో పెట్టుబడిదారులు ముందుకు రావడంలేదు. మరోవైపు ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు నిధులిస్తే తాము పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని టీజీఐఐసీ అధికారులు చెప్తున్నారు. భూములను అభివృద్ధిచేస్తే పరిశ్రమల ఏర్పాటుకు ఎవరైనా ముందుకొచ్చే వీలుంటుందని వారు పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో వరితోపాటు పప్పుధాన్యాలు, మక్కజొన్న, సోయా, జొన్నలు, చెరుకు, వేరుశనగ, పామాయిల్ తదితర పంటలు విరివిగా పండుతున్నాయి. వీటితోపాటు జామ, మామిడి, పొప్పాయ వంటి పండ్ల తోటలు కూడా ఇటీవల బాగా విస్తరించాయి. కోళ్లఫారాలు, డెయిరీ రంగం కూడా బాగానే వృద్ధి చెందింది. వీటికి సరైన గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు ఆ ఉత్పత్తులకు విలువను జోడించేందుకు వీలుగా ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరిగే ఆస్కారమున్నది. ఈ ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ, పారిశ్రామికరంగ ప్రముఖులతో చర్చించి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు నిర్ణయానికొచ్చింది.
గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఖమ్మం జిల్లా బుగ్గపాడులో ఏర్పాటుచేసిన మెగా ఫుడ్‌పార్క్‌ను ఈ ఏడాది సంక్రాంతినాటికి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఫుడ్‌పార్క్ పనుల పురోగతిపై మంగళవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. 60ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన బుగ్గపాడు మెగా ఫుడ్పార్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగంలో గేమ్‌చేంజర్‌గా మారనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.109 కోట్లు. ప్రస్తుతం 26 ఎకరాల్లో 26 కంపెనీలకు ఒక్కో ఎకరం చొప్పున ప్లాట్లు కేటాయించారు. తాజాగా దీపక్ నెక్స్‌జెన్ ఆక్వా ప్రాజెక్ట్‌కు స్థలం కేటాయించగా, సదరు సంస్థ రూ.615 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే 3,200 మందికి ఉపాధి అవకాశాలు దకనున్నాయి. రోడ్డు, రైల్వే, పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా స్ట్రాటజిక్ లొకేషన్లో బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటుచేశారు. ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా, పౌల్ట్రీ రంగాలకు ఈ పార్క్ కీలకంగా మారనున్నట్టు ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు వివరించారు.
