Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో ప్రగతి సాధించినట్టు ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఎంఎస్ఎంఈ పాలసీలో వివరించింది. టీఎస్ ఐపాస్ ద్వారా ఎంఎస్ఎంఈల నమోదు ప్రక్రియ అత్యధికంగా జరిగినట్టు వెల్లడించింది. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే వృద్ధిరేటు ఎంతో మెరుగ్గా ఉన్నదని తెలిపింది. ఎంఎస్ఎంఈల సగటు పెట్టుబడి రూ.2.15కోట్లకు పెరిగినట్టు పేర్కొంది. తరచూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించే రాష్ట్ర సర్కారు, పరిశ్రమల అభివృద్ధిలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను ఒప్పుకోక తప్పలేదు.
ఎంఎస్ఎంఈ పాలసీలో గత ప్రభుత్వం సాధించిన ప్రగతిని అంకెలతో సహా వివరించింది. టీజీ-ఐపాస్ పోర్టల్లో నమోదైన కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లను పరిశీలిస్తే, గడిచిన పదేండ్లలో వరుసగా వృద్ధి నమోదైంది. పదేండ్లలో 11.15 శాతం నుంచి 15 శాతం వరకు వృద్ధి నమోదైనట్టు ప్రభుత్వం వివరించింది. నేడు తెలంగాణలో ఎంఎస్ఎంఈల సంఖ్య 26 లక్షలుగా ఉన్నదని వెల్లడించింది. సగటు పెట్టుబడులు కూడా 115 శాతం పెరిగినట్టు తెలిపింది. ఎంఎస్ఎంఈలో ఉపాధి అవకాశాలు 20 శాతం పెరిగినట్టు, ఎస్సీ, ఎస్టీలు 30శాతం ఎంఎస్ఎంఈల్లో ఉపాధి పొందినట్టు స్పష్టం చేసింది. కొవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా పరిశ్రమలు పెద్ద ఎత్తున మూతపడినా తెలంగాణలో మాత్రం ఆ సంఖ్య నామమాత్రంగా ఉండడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన పారిశ్రామిక అనుకూల విధానాలతో పరిశ్రమలు కొవిడ్ తర్వాత త్వరగా కోలుకున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పిన తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ (టీఐహెచ్సీఎల్) నష్టాల్లో కూరుకుపోయిన 1340 యూనిట్లకు సహకారం అందించడమే కాకుండా మూతపడిన 115 యూనిట్లను పునరుద్ధరించింది. తెలంగాణ పదేండ్లలో పారిశ్రామిక రంగంలో ఇతర రాష్ర్టాల కన్నా శరవేగంగా వృద్ధి సాధించినట్టు ప్రభుత్వం పేర్కొంది. పరిశ్రమల కోసం జరిపే భూముల కొనుగోలులో స్టాంప్ డ్యూటీ మినహాయింపును యథావిధిగా కొనసాగించడంతో పాటు టీ-ప్రైడ్, టీ-ఐడియా పథకాల రాయితీలను స్వల్పంగా పెంచారు. కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన టీఎస్ ఐపాస్ వంటి సింగిల్ విండో విధానం, స్నేహపూర్వక విధానాలు, నిరంతర విద్యుత్తు సరఫరా తదితర అనేక కారణాలతో తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో ప్రముఖంగా ఎదిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.