న్యూఢిల్లీ, డిసెంబర్ 5: గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దేశీయ బ్యాంకులు రూ.10.57 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. కాగా, రైటాఫ్ చేసిన రుణాల్లో రూ.5.52 లక్షల కోట్లు భారీ పరిశ్రమలకు చెందినవేనని రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ సమాధానమిచ్చారు. ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వివరాల ప్రకారం దేశంలోనిషెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2018-19 నుంచి 2022-23 వరకు) రూ.10.57 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి’ అని వివరించారు.
బ్యాంకులను మోసం చేసి తీసుకున్న రుణాల్లో రూ.93,874 కోట్లను ఈ ఐదేండ్లలో ఆయా బ్యాంకులు రైటాఫ్ చేసినట్టు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఎంతకీ వసూలు కాని రుణాలు మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏ)గా మారాయన్న మంత్రి.. వాటి వసూలుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే గడిచిన ఐదేండ్లలో రూ.7.15 లక్షల కోట్లను వసూలు చేశామని పేర్కొన్నారు.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీసుకున్న చర్యలతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ నెల 1నాటికి రూ.15,184 కోట్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులపై నమోదైన కేసుల్లో వారి ఆస్తులను ఈడీ జప్తు చేసిందని రాజ్యసభకు మంత్రి తెలియజేశారు. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి 13,978 రుణ ఖాతాలపై రికవరీ కోసం లీగల్ సూట్స్ దాఖలయ్యాయని, ఇందులో 11,483 కేసుల్లో సర్ఫేసీ చట్టం కింద చర్యలు తీసుకున్నామని, 5,674 కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని చెప్పారు. ఈ క్రమంలోనే మొత్తం రూ.33,801 కోట్ల రికవరీ జరిగిందన్న మంత్రి.. పీఎంఎల్ఏ కింద రూ.15,186.64 కోట్లు వచ్చాయని, వీటిలో రూ.15,183.77 కోట్లు ప్రభుత్వ బ్యాంకులకు ఇచ్చామని వివరించారు. అలాగే గత రెండు ఆర్థిక సంవత్సరాల నుంచి ఎన్పీఏ ఖాతాలు తగ్గుతున్నాయని, 2.19 కోట్ల నుంచి 2.06 కోట్లకు వచ్చాయని చెప్పారు. ఈ ఖాతాల మొత్తం విలువ చూసినా రూ.7.41 లక్షల కోట్ల నుంచి రూ.5.72 లక్షల కోట్లకు తగ్గాయని వివరించారు.