న్యూఢిల్లీ, మే 26: డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి ఒక్కో బ్యాంకులు. రిజర్వుబ్యాంక్ కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రుణాలపై వడ్డీరేట్లను తగ్గించిన పలు బ్యాంక్లు..తాజాగా డిపాజిట్లపై కూడా కోత పెడుతున్నాయి. దీంట్లోభాగంగా ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్లు కూడా తమ డిపాజిట్లపై వడ్డీరేట్లను 20 బేసిస్ పాయింట్లు కోత పెట్టాయి. రూ.3 కోట్ల లోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 20 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది ఐసీఐసీఐ బ్యాంక్. ఈ నూతన రేట్లు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయని పేర్కొంది.
దీంతో బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీరేటు 3 శాతం నుంచి 7.05 శాతం మధ్యలోకి దిగిరాగా, సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం నుంచి 7.55 శాతం లోపు వడ్డీని ఆఫర్ చేస్తున్నది బ్యాంక్. మరోబ్యాంక్ హెచ్డీఎఫ్సీ కూడా ఇంతే స్థాయిలో డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించింది. రూ.3 కోట్ల లోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను కోత పెట్టింది. ఈ రేట్లు ఈ నెల 23 నుంచి అమలులోకి వచ్చాయని పేర్కొంది. దీంతో ఎఫ్డీలపై వడ్డీరేట 3 శాతం నుంచి 6.85 శాతానికి దిగిరాగా, సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం నుంచి 7.35 శాతానికి దిగొచ్చాయి. గత నెలలో ఎఫ్డీలపై వడ్డీరేట్లను అర శాతం తగ్గించిన విషయం తెలిసిందే.