న్యూఢిల్లీ, అక్టోబర్ 31: బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,809 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.5,238 కోట్ల లాభంతో పోలిస్తే 8 శాతం తగ్గింది. వడ్డీల మీద వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది.
సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.35,445 కోట్ల నుంచి రూ.35,026 కోట్లకు పడిపోయినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంట్లో వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.30,278 కోట్ల నుంచి రూ.31,511 కోట్లకు పెరిగినప్పటికీ లాభాల్లో గండిపడింది.
సమీక్షకాలంలో బ్యాంక్ ఆపరేటింగ్ లాభం ఏడాది ప్రాతిపదికన 20 శాతం తగ్గి రూ.7,576 కోట్లకు పరిమితమైంది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.50 శాతం నుంచి 2.16 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ కూడా 0.57 శాతానికి పరిమితమైంది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి గత త్రైమాసికంలోనూ బ్యాంక్ రూ.1,232 కోట్ల నిధులను వెచ్చించింది.