ముంబై, జనవరి 30 : ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.5,443 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. మొండి బకాయిలకు నిధుల కేటాయింపులు తగ్గుముఖం పట్టడం, నికర వడ్డీ మార్జిన్ అధికం కావడం వల్లనే లాభాల్లో 4.39 శాతం వృద్ధి నమోదైందని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవదత్త చంద్ తెలిపారు.
నికర వడ్డీ ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.11,800 కోట్లకు చేరుకున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11-13 శాతం వృద్ధిని సాధిస్తామన్న ధీమాను ఆయన వ్యక్తంచేశారు. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి గత త్రైమాసికంలో బ్యాంక్ నిధుల కేటాయింపులు 26.2 శాతం తగ్గి రూ.799 కోట్లకు పరిమితమవగా, కొత్తగా రూ.2,676 కోట్ల రుణాలు మొండి బకాయిల జాబితాలోకి చేరాయన్నారు.