Banking Fraud- RBI Report | రోజురోజుకు పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలతోపాటు సైబర్ మోసాలు ఎక్కువతున్నాయి. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ఏయేటికాయేడు ఆర్థిక మోసాలు పెరుగుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 36,075 మోసాలు రికార్డయ్యాయి. అంతకుముందు 2021-22లో 9,046, 2022-23లో 13,564 మోసాలతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన మోసాలు దాదాపు 300 శాతం ఎక్కువ. మోసాలు పెరిగినా ప్రజలు పోగొట్టుకున్న సొమ్ము తగ్గడం ఒకటే ఊరట. 2021-22లో రూ.45,358 కోట్ల సొమ్ము కోల్పోతే 2022-23తో రూ.26,127 కోట్లు, 2023-24లో బ్యాంకింగ్ మోసాల వల్ల ప్రజలు రూ.13,930 కోట్లకు తగ్గిందని ఆర్బీఐ గురువారం వెల్లడించిన నివేదికలో పేర్కొంది. అంటే గత రెండేండ్లలో మొత్తం సైబర్ మోసాల్లో నష్టపోయిన సొమ్ము 46.7 శాతానికి పడిపోయింది. ప్రత్యేకించి డిజిటల్ చెల్లింపుల విభాగంలో మోసాలు 708 శాతం పెరిగాయని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది.
గత మూడేండ్లలో ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఎక్కువ మోసాలు జరిగితే, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువ సొమ్ము నష్టపోవడంలో ముందు ఉన్నాయని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. డిజిటల్ పేమెంట్స్ విభాగంలో అధిక సంఖ్యలో మోసాలు జరిగితే, రుణ విభాగంలో అధిక మొత్తంలో మోసగాళ్లు నగదు స్వాహా చేశారని వివరించింది. డిజిటల్ పేమెంట్స్, లోన్ పోర్ట్ ఫోలియో విభాగాల్లోనూ మోసపోయిన వాటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులే ముందు ఉన్నాయని తెలిపింది.
2021-22లో 3,596 కార్డ్, ఇంటర్నెట్ మోసాలు జరిగితే, 2023-24లో ఆ సంఖ్య 29,082కు పెరిగిందని ఆర్బీఐ వివరించింది. ఈ మోసాల్లో కొద్దిపాటి నగదు మొత్తాలు అధికంగా ఉన్నాయని, ఈ తరహా మోసాల వల్ల గత రెండేండ్లలో కోల్పోయిన మొత్తం నగదు రూ.155 కోట్ల నుంచి రూ.1,457 కోట్లకు చేరింది. అయితే గత రెండేండ్లలో మోసం జరిగిన తేదీకి, జరిగిన మోసాన్ని గుర్తించడానికి మధ్య చాలా సమయం ఉంటున్నదని ఆర్బీఐ గుర్తించింది.