లక్నో : అయోధ్యలో జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవానికి (Ram Mandir Inauguration) సర్వం సిద్ధమవుతుండగా ఆపై రాముడి సన్నిధికి రోజూ వేలాది మంది తరలిరానుండటంతో పలు వ్యాపారాలు ఊపందుకోనున్నాయి. అయోధ్యలో నూతన రామాలయ నిర్మాణంతో ఆతిధ్య, నిర్మాణ, పౌరవిమానయాన సహా పలు రంగాల షేర్లు లబ్ధి పొందుతున్నాయి. గత నెలరోజులుగా ఆతిధ్య రంగానికి చెందిన ప్రవేగ్ లిమిటెడ్ షేర్ విలువ ఏకంగా 70 శాతం పైగా లాభపడింది.
ఈ ప్రాంతంలోని హోటల్ రేట్లు ఒక నైట్‌కు రూ. 73,000కు ఎగబాకడంతో ఆతిధ్య రంగానికి డిమాండ్ నెలకొంది. ఇక ఎయిర్‌లైన్ కంపెనీలు సైతం అయోధ్యకు విమాన సర్వీసులు ప్రారంభించాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి అయోధ్యను కలుపుతూ ఇండిగో విమానాలను రాకపోకలను ప్రారంభిస్తోంది. డిమాండ్ అధికంగా ఉండటంతో విమాన టికెట్ల ధరలు అమాంతం ఎగబాకుతున్నాయి.
దీంతో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, స్పైస్‌జెట్ వంటి విమానయాన కంపెనీల షేర్లు పెరుగుతున్నాయి. మరోవైపు రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వేయికి పైగా రైళ్లను అయోధ్యకు నడపాలని ఐఆర్సీటీసీ యోచిస్తోంది. ఇక ఐఆర్సీటీసీ షేర్, రైల్ వికాస్ నిగం లిమిటెడ్ షేర్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఇక టూరిజం, ట్రావెల్ ఏజెన్సీల షేర్లు సైతం స్టాక్మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఈజ్‌మైట్రిప్ షేర్ ధర కేవలం ఐదు రోజుల్లోనే 13 శాతం పెరిగింది. ఇంకా అపోలో సింధూరి హోటల్స్, ప్రవేగ్, జెనెసిస్ ఇంటర్నేషనల్, ఐఆర్సీటీసీ, ఇండిగో వంటి పలు షేర్ల ధరలు ఎగబాకాయి.
Read More :