న్యూఢిల్లీ : అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం (Banking Crisis) ముదురుతోంది. లేటెస్ట్గా మరో అమెరికన్ బ్యాంక్ పసిఫిక్ వెస్ట్రన్ బ్యాంక్ సమస్యల్లో కూరుకుపోయింది. బ్యాంక్‌ను విక్రయించడం, మూలధనం పెంచడం వంటి పలు వ్యూహాత్మక అవకాశాలను పరిశీలిస్తున్నారనే వార్తలతో పసిఫిక్ వెస్ట్రన్ బ్యాంక్ షేర్లు ఏకంగా 52 శాతం కుప్పకూలాయి. లాస్ఏంజెల్స్ ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఈ బ్యాంక్ పతనం అంచున ఉండటంతో బ్యాంక్ విక్రయం లేదా మూలధన పెంపుపై ప్రమోటింగ్ కంపెనీ కసరత్తు సాగిస్తోందనే వార్తలు మదుపర్లలో కలకలం రేపాయి.
అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం తీవ్రతరం కావడంతో ఇప్పటికే సిల్వర్‌గేట్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్, ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌లు పతనమయ్యాయి. రుణ బకాయిలు పేరుకుపోవడంతో పసిఫిక్ వెస్ట్రన్ బ్యాంక్ సంక్షోభంలో కూరుకుపోయింది. తమ రుణాల పోర్ట్‌పోలియోను విక్రయించే ప్రక్రియనూ బ్యాంక్ వేగవంతం చేసింది. వాటాదారుల విలువను కాపాడేందుకు పలు భాగస్వాములు, ఇన్వెస్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని, చర్చలు పురోగతిలో ఉన్నాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
పసిఫిక్ వెస్ట్ బ్యాంక్ మాత్రమే కాకుండా ఫీనిక్స్కు చెందిన ప్రాంతీయ బ్యాంక్ వెస్ట్రన్ అలయన్స్ బ్యాంక్‌కార్ప్ షేర్లు సైతం కుప్పకూలాయి. ఈ ఏడాది మార్చిలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌లు కుప్పరకూలిన అనంతరం ప్రారంభమైన బ్యాంకింగ్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ప్రభుత్వం, రెగ్యులేటర్లు పలు చర్యలు చేపడుతున్నా ప్రాంతీయ బ్యాంకుల పరిస్ధితిపై అమెరికన్ ఇన్వెస్టర్లలో ఆందోళన కొనసాగుతోంది. పలు బ్యాంకు షేర్ల పతనం దీనికి సంకేతంగా నిపుణులు చెబుతున్నారు.
Read More