న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సంస్థకు ఏడేండ్లకుగాను 105.42 కోట్ల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) డిమాండ్ నోటీస్ జారీ అయ్యింది. ఆయా రాష్ర్టాల్లోని కార్యకలాపాలకు సంబంధించి పన్ను, దానిపై వడ్డీ, జరిమానాలతో కూడిన జీఎస్టీ నోటీస్ బుధవారం వచ్చినట్టు కంపెనీ పేర్కొన్నది. 2017-18 నుంచి 2023-24కు మధ్య కాలానికిగాను తాఖీదులందాయని స్టాక్ ఎక్సేంజీలకు ఎల్ఐసీ తెలియజేసింది. అయితే ఈ నోటీస్‌పై లక్నో అప్పీల్స్ కమిషనర్ ఎదుట అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉన్నట్టు సంస్థ వెల్లడించింది. ఇదిలావుంటే 2017-18 నుంచి 2021-22కు మధ్య రూ.101.95 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీస్ మంగళవారం కూడా ఒకటి అందింది.