Paytm Wallet | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: రిజర్వ్ బ్యాంక్ నిషేధానికి గురైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన వ్యాలెట్ వ్యాపారాన్ని విక్రయించేందుకు జోరుగా చర్చలు జరుపుతుందన్న వార్తలు వెలువడుతున్నాయి. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ జియో ఫైనాన్షియల్, ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లతో పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్ చర్చిస్తున్నదని సంబంధిత సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను ఉటంకిస్తూ హిందూ బిజినెస్‌లైన్ తాజా కథనం పేర్కొంది. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్ శర్మ బృందం గత ఏడాది నవంబర్ నుంచే జియోతో చర్చలు జరుపుతుండగా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ నిషేధం విధించే ముందు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో చర్చలు మొదలుపెట్టారు. బెయిల్అవుట్ ప్రణాళికలో భాగంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను సైతం కొనేందుకు జియో ముందుకు వచ్చిందని సమాచారం.
ఇప్పటికే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ డిపాజిట్ల సేకరణపై నిషేధం విధించిన ఆర్బీఐ ఈ బ్యాంక్ లైసెన్సు కూడా రద్దు చేస్తుందన్న వార్తలు వెలువడటంతో వన్ 97 కమ్యూనికేషన్స్ షేరు ఎన్ఎస్ఈలో సోమవారం మరో 10 శాతం పడిపోయి ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయి రూ.438.5 వద్ద ముగిసింది. ఈ షేరు కేవలం 3 రోజుల్లో 42 శాతం పతమయ్యింది. 2021 నవంబర్‌లో రూ.2,150 ధరతో ఈ కంపెనీ ఐపీవోకు వచ్చిన విషయం విదితమే. డిపాజిట్ల సేకరణను నిషేధించడంతో పాటు పరపతి లావాదేవీల నిర్వహణ, కస్టమర్ ఖాతాలకు టాప్అప్లు ఇవ్వడం, ప్రీపెయిడ్ సాధనాలు, వ్యాలెట్లు, కార్డులు జారీచేయడం తదితర పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) నిర్వహించే కార్యకలాపాలను ఫిబ్రవరి 29 తర్వాత చేపట్టరాదని ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే.
మనీలాండరింగ్ జరుగుతుందన్న ఆందోళన, నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనల ఉల్లంఘనలతో పాటు పేటీఎం వ్యాలెట్, సంబంధిత బ్యాంక్‌ల మధ్య వందల కోట్ల రూపాయిల సందేహాస్పద లావాదేవీలు జరగడంతో పేటీఎం బ్యాంక్‌పై రిజర్వ్‌బ్యాంక్ నిషేధం విధించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చెప్పారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు 35 కోట్ల ఈ-వ్యాలెట్లు ఉండగా, అందులో 31 కోట్లు అరుదుగా లావాదేవీలు జరిగే డోర్మాంట్ వ్యాలెట్లని, కేవలం 4 కోట్ల వ్యాలెట్లు మాత్రమే బ్యాలెన్స్ లేకుండా లేదా అతితక్కువ బ్యాలెన్స్‌తో నడుస్తున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
పేటీఎం వ్యాలెట్‌ను కొనుగోలు చేస్తుందన్న వార్తలతో సోమవారం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరు 15 శాతం పెరిగి ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయి రూ. 295 వద్ద ముగిసింది. గత ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విభజించిన జియో ఫైనాన్షియల్‌కు జియో పేమెంట్స్ బ్యాంక్ ఉన్నది. ఇది డిజిటల్ సేవింగ్స్ ఖాతాల్ని, బిల్ పేమెంట్స్ సర్వీసుల్ని ప్రారంభించేందుకు సంసిద్ధమవుతున్నది. ఇప్పటికే డెబిట్ కార్డుల్ని కూడా విడుదల చేస్తున్నది.
పేటీఎం ఉదంతంపై ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తదితర చట్ట సంబంధిత ఏజెన్సీలు దర్యాప్తు జరపడం లేదని కేంద్ర రెవిన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా చెప్పారు. ఒక తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘ఏవైనా చర్యలు తీసుకోవాల్సివస్తే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు తీసుకుంటాయి. ఇప్పుడు అదేమీ లేదు’ అని చెప్పారు. ఇదే విషయాన్ని పేటీఎం వెల్లడిస్తూ మనీ లాండరింగ్ ఆరోపణలపై తమ వ్యవస్థాపకుడు, సీఈవోపై ఈడీ దర్యాప్తు చేస్తున్నదన్న వార్తల్ని ఖండించింది.