Actor | నేపాలీ సినిమా ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించిన లెజెండరీ నటుడు సునీల్ థాపా (68) ఇక లేరు. గుండెపోటుతో ఆయన శుక్రవారం ఉదయం ఖాట్మండులో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో నేపాల్‌తో పాటు భారత సినీ అభిమానులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘ది ఖాట్మండు పోస్ట్’ వెల్లడించిన వివరాల ప్రకారం, గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సునీల్ థాపా ఖాట్మండులోని తపస్థలిలో ఉన్న నోర్విక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో హార్ట్ ఎటాక్ రావడంతో ఆయన కన్నుమూశారు.
నేపాలీ సినిమా రంగంలో సునీల్ థాపా ఒక దిగ్గజంగా పేరుపొందారు. ముఖ్యంగా విలన్ పాత్రలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆయన నటనకు అక్కడి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ ఉండేది. కేవలం నేపాలీ సినిమాలకే పరిమితం కాకుండా హిందీ, భోజ్‌పురి, తమిళం, తెలుగు భాషల్లో కూడా ఆయన నటించి తన ప్రతిభను చాటుకున్నారు. భారతీయ ప్రేక్షకులకు కూడా సునీల్ థాపా సుపరిచితమే. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన 2014 చిత్రం ‘మేరీ కోమ్’ లో ఆమె కోచ్ నర్జిత్ సింగ్ పాత్రలో సునీల్ నటన విశేషంగా ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా ద్వారా ఆయనకు భారతదేశంలోనూ మంచి గుర్తింపు లభించింది.
తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన పరిచయం ఉంది. 2025లో విడుదలైన తేజ సజ్జా చిత్రం ‘మిరాయ్’ లో సునీల్ థాపా కీలక పాత్ర పోషించారు. హిమాలయ ప్రాంతాల గొప్పతనం, అక్కడి ప్రమాదాల గురించి చెప్పే పాత్రలో ఆయన కనిపించారు. ఆయన మరణంపై ఆ సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించింది. సునీల్ థాపా సినీ ప్రయాణం 1981లో వచ్చిన హిందీ చిత్రం ‘ఏక్ దూజే కే లియే’ తో ప్రారంభమైంది. నటనలోకి రాకముందు 1970లలో ముంబైలో మోడల్‌గా తన కెరీర్ మొదలుపెట్టారు. అనంతరం దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 1991లో వచ్చిన కల్ట్ క్లాసిక్ నేపాలీ చిత్రం ‘చినో’ లో ఆయన పోషించిన విలన్ పాత్ర సినీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచింది. ఇటీవల వెబ్ సిరీస్‌ల్లో కూడా ఆయన నటించారు. ప్రముఖ హిందీ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్–2లో నాగాలాండ్ నాయకుడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సునీల్ థాపా మరణంతో నేపాలీ సినీ రంగం ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని సినీ ప్రముఖులు భావోద్వేగంతో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.