TGIIC | హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): భారీగా పెట్టుబడులు తెస్తున్నట్టు, పారిశ్రామికరంగానికి పెద్దపీట వేస్తున్నట్టు ప్రభుత్వం పదేపదే చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు. గత సంవత్సరకాలంగా పరిశ్రమల కోసం భూముల కేటాయింపును టీజీఐఐసీ నిలిపివేయడమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు పేర్కొంటున్నారు. చిన్నచిన్న యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు భూముల కోసం టీజీఐఐసీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కేవలం ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారసు ఉన్నవారికి మాత్రమే భూములు విక్రయిస్తుండగా, ఎవరి సిఫారసు లేకుండా ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను పరిశీలించే నాథుడే లేకుండాపోయాడు. సొంత వ్యాపారాలపై దృష్టి పెడుతున్న యువత ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. పారిశ్రామికరంగంలో 95 శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలే (ఎంఎస్ఎంఈ) ఉన్నాయి.
అత్యధికంగా ఉపాధిని కల్పిస్తున్నది కూడా ఈ పరిశ్రమలే. రూ.50 కోట్లలోపు పెట్టుబడి ఉన్న పరిశ్రమలన్నీ ఈ కోవలోకి వస్తాయి. వీటికి భూమి కూడా పెద్దగా అవసరం ఉండదు. సుమారు 500 గజాల నుంచి రెండు ఎకరాలలోపు భూమి ఉంటే చాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు కూడా లభిస్తుండటంతో చాలామంది తమ అభిరుచులకు అనుగుణంగా ఏదో ఒక చిన్నతరహా పరిశ్రమను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. వీరికి భూమి కొనుగోలు చేయడం అనివార్యం. టీజీఐఐసీ అభివృద్ధి చేసిన లేఔట్లలో భూములు కొనుగోలుచేస్తే న్యాయపరంగా ఎటువంటి చిక్కులు ఉండకపోవడంతోపాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు కూడా సులభంగా లభిస్తాయి. అందుకే ఎక్కువశాతం మంది ప్రైవేటుగా భూములు కొనుగోలు చేసే బదులు టీజీఐఐసీ పారిశ్రామికవాడలవైపే మొగ్గుచూపుతారు.
టీజీఐఐసీ దాదాపు ఏడాదికాలం నుంచి భూముల కేటాయింపు ప్రక్రియను పూర్తిగా నిలిపివేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో పారదర్శకంగా భూముల కేటాయింపు జరిగేది. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను వారంవారం పరిశీలించి అర్హతలకు అనుగుణంగా భూములు కేటాయించేవారు. వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి భూముల కేటాయింపుకోసం గతంలో ప్రతివారం బోర్డు సమావేశాన్ని నిర్వహించేవారు. అయితే ఏడాదికాలంగా ఈ సమావేశాలు జరగక.. దరఖాస్తులన్నీ పెండింగులో ఉన్నాయి. అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వచ్చిన సిఫారసుల ప్రకారమే భూముల కేటాయింపు జరుగుతున్నది తప్ప సొంతంగా ముందుకొచ్చేవారి దరఖాస్తులను ఆన్లైన్లో కూడా పరిశీలించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
టీజీఐఐసీ కార్యాలయానికి వెళ్తే ఉన్నతాధికారులు ఎవరూ అందుబాటులో ఉండటంలేదని, కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడంలేదని కొందరు పారిశ్రామికవేత్తలు తెలిపారు. ప్రైవేటుగా భూములు కొనుగోలుచేసి యూనిట్ పెట్టుకుందామంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు వస్తాయో.. రావో అనే సందేహం ఉందని, అందుకే టీజీఐఐసీ చుట్టూ తిరుగుతున్నామన్నారు. తమ ప్రయత్నాలు వృథా ప్రయాసగానే మారుతున్నాయని వాపోతున్నారు.
ఒకవైపు పారిశ్రామికవాడల కోసం ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ యత్నాలకు రైతులనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. గత బీఆర్ఎస్ సర్కారు ప్రభుత్వ భూములతో కూడిన దాదాపు 1.50 లక్షల ఎకరాల ల్యాండ్‌బ్యాంక్‌ను సిద్ధం చేసింది. దాదాపు 156 వరకూ ఇండస్ట్రియల్ పార్క్‌లను నెలకొల్పి 28 వేల ఎకరాలకుపైగా భూములను పరిశ్రమలకు కేటాయించింది. చాలా పార్క్‌లలో మౌలిక సదుపాయాలు కల్పించి పరిశ్రమలకు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా దృష్టి పెట్టకుండా కేవలం పెట్టుబడులు తెస్తున్నట్టు ఊదరగొడుతున్నది. స్థానికంగా అనేకమంది ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొస్తున్నా… వారికి భూములు కేటాయించకుండా బహుళజాతి కంపెనీలు వస్తున్నాయంటూ ప్రచారం చేస్తున్నది. మల్టీ నేషనల్ కంపెనీలు రావాల్సిన అవసరం ఎంత ఉన్నదో, ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు తోడ్పడాల్సిన అవసరం అంతకన్నా ఎక్కువ ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.