న్యూఢిల్లీ, డిసెంబర్ 24: దేశంలో విమాన ప్రయాణీకుల రద్దీ పెరిగింది. దేశీయంగా ఎయిర్ ప్యాసింజర్స్ గత నెల దాదాపు 12 శాతం పెరిగినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన తాజా లెక్కలు చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆయా మార్గాల్లో భారతీయ సంస్థలకు చెందిన విమాన సర్వీసులు నవంబర్‌లో 1.42 కోట్ల మంది ప్రయాణీకులను మోసుకెళ్లినట్టు డీజీసీఏ వెల్లడించింది. ఈ ఏడాదితో పోల్చితే గత ఏడాది నవంబర్‌లో 11.90 శాతం తక్కువగా ప్రయాణీకులు నమోదయ్యారని పేర్కొన్నది. నాడు 1.27 కోట్లేనని తమ నివేదికలో డీజీసీఏ స్పష్టం చేసింది. ఇక ఈ ఏడాది అక్టోబర్‌లో విమాన ప్రయాణీకుల రద్దీ 1.36 కోట్లుగా ఉన్నది.
ఇండిగో టాప్
దేశీయ విమానయాన మార్కెట్లో ఇండిగో వాటా అత్యధికంగా 63.6 శాతంగా ఉన్నది. ఆ తర్వాత ఎయిర్ ఇండియా (24.4 శాతం), ఆకాశ ఎయిర్ (4.7 శాతం), స్పైస్‌జెట్ (3.1 శాతం), అలయెన్స్ ఎయిర్ (0.7 శాతం) ఉన్నాయి. వీటిలో అలయెన్స్ ఎయిర్ మినహా మిగతా సంస్థల వాటా గతంతో పోల్చితే పెరగడం గమనార్హం. ఇదిలావుంటే ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య దేశీయ విమానయాన సంస్థలు చూసిన ప్రయాణీకులు 14.64 కోట్లుగా ఉన్నారు. నిరుడు ఇదే సమయంలో 13.82 కోట్లుగా ఉన్నారు. దీంతో వార్షిక వృద్ధి 5.91 శాతంగా ఉన్నది.
ఆన్ టైమ్‌లో..
దేశీయ ఎయిర్‌లైన్స్‌ల్లో ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ (ఓటీపీ)పరంగా ఇండిగో 74.5 శాతంతో అన్నింటికంటే ముందున్నది. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై విమానాశ్రయాల్లో నమోదైన రికార్డులనుబట్టి షెడ్యూల్ ప్రకారం నవంబర్‌లో ఎక్కువగా ఇండిగో విమాన సర్వీసులే నడిచినట్టు తేలింది. ముందుగా ప్రకటించిన సమయానికే ప్రయాణీకులకు అత్యధిక ఇండిగో విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయని డీజీసీఏ తెలిపింది. ఈ విషయంలో ఆకాశ ఎయిర్ 66.4 శాతంతో రెండో స్థానంలో, స్పైస్‌జెట్ కూడా 62.5 శాతంతో ఫర్వాలేదనిపించింది. కానీ 58.9 శాతంతో అలయెన్స్ ఎయిర్, 58.8 శాతంతో ఎయిర్ ఇండియా చివర్లో నిలిచాయి. ఈ క్రమంలోనే గత నెల విమానాల ఆలస్యంతో సుమారు 2.25 లక్షల మంది ప్రయాణీకులు అసౌకర్యానికి గురైనట్టు డీజీసీఏ ప్రకటించింది. 624 మంది నుంచి ఫిర్యాదులు కూడా వచ్చినట్టు చెప్పింది. అలాగే విమానాల రద్దుతో 27,577 మంది ప్రయాణీకులు ప్రభావితమైనట్టు పేర్కొన్నది.
హైదరాబాద్‌దే హవా
ఈ ఏడాది పర్యాటకుల తాకిడి అత్యధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ముందున్నదని తమ ‘ట్రావెలోపీడియా 2024’ వార్షిక నివేదికలో ఓయో తెలిపింది. మంగళవారం విడుదలైన ఈ రిపోర్టులో హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా ఉన్నట్టు తేలింది. ఇక రాష్ర్టాలపరంగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నది. ఈ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ఎక్కువమంది టూరిస్టులు బుకింగ్ చేసుకున్నట్టు ఓయో తెలియజేసింది. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకలకూ డిమాండ్ బాగానే కనిపించిందని పేర్కొన్నది. కాగా, ఆధ్యాత్మిక యాత్రలపరంగా చూసినైట్టెతే పూరీ, వారణాసి, హరిద్వార్ ముందు వరుసలో ఉన్నాయి.