Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ఉదయం నుంచి ముగింపు వరకు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. చివరలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఇంట్రాడేలో వచ్చిన లాభాలన్నీ ఆవిరవగా.. చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 80,904.40 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 80,733.07 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. గరిష్టంగా 81,171.38 పాయింట్ల వరకు పెరిగింది. చివరకు 76.54 పాయింట్ల లాభంతో 80,787.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 32.15 పాయింట్లు పెరిగి.. 24,773.15 వద్ద స్థిరపడింది. ఆటో, మెటల్, ఆయిల్, గ్యాస్, పీఎస్‌యూ బ్యాంకులు రాణించడంతో నిఫ్టీ 24,885.50 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. అయితే, చివరి గంటలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో.. స్వల్ప లాభాలతో బయటపడింది.
బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5శాతం పెరిగాయి. నిఫ్టీలో ప్రధానంగా టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐషర్ మోటార్స్, ఎం అండ్ ఎం, బజాజ్ ఆటో నిఫ్టీలో లాభాలను ఆర్జించాయి. ట్రెంట్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా నష్టపోయాయి. ఆటో ఇండెక్స్ 3.3శాతం, రియాలిటీ ఆయిల్, గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్ 0.5 శాతం నుంచి ఒకశాతం వరకు పెరిగాయి. కార్లు, ఎస్‌యూవీల ధరల తగ్గింపుతో టాటా మోటార్స్ షేర్లు 3.6శాతం పెరిగాయి, ఐసీఈ ఎస్యూవీ పోర్ట్‌ఫోలియోలో ధరల తగ్గింపుతో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు 4శాతం వృద్ధిని నమోదు చేశాయి. సింగపూర్‌కు చెందిన హారిజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీస్‌తో అవగాహన ఒప్పందంతో బీహెచ్ఈఎల్ షేర్ ధర 2.3శాతం పెరిగింది. జుహై పివిన్ న్యూ ఎనర్జీతో వ్యూహాత్మక భాగస్వామ్యం తర్వాత సర్వోటెక్ షేర్లు 5.8శాతం పెరగ్గా.. భూటాన్‌లో 570 మెగా వాట్స్ జలవిద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడంతో అదానీ పవర్ షేర్ ధర 4.2శాతం పెరిగింది. స్పైస్‌జెట్ షేర్లు 3.25శాతం.. వేదాంత 2శాతం, జైప్రకాష్ అసోసియేట్స్ షేర్లు 5శాతం పడిపోయాయి.