న్యూఢిల్లీ, జూలై 9: ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) దేశ జీడీపీ వృద్ధిరేటు పడిపోవచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) హెచ్చరించింది. ఈ క్రమంలోనే 6.6 శాతంగా అంచనా వేసింది. అంతకుముందు 6.9 శాతంగా ఉండటం గమనార్హం. కాగా, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలే ఈ వృద్ధి కోతలకు కారణమని తాజా ఎడిషన్‌లో ఏడీబీ స్పష్టం చేసింది. అమెరికా-ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతుండటంతో పశ్చిమాసియాను మళ్లీ సంక్షోభం ఛాయలు అలుముకున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో మరోమారు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యానికి అండగా ఉంటున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతున్నది మరి. ఈ నేపథ్యంలోనే భారత జీడీపీ ప్రగతి అంచనాకు 30 బేసిస్ పాయింట్లు ఏడీబీ కోత పెట్టింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2027-28)గాను వృద్ధిరేటు అంచనాను 7.3 శాతంగానే కొనసాగించింది.
దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇందులో యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ తదితర గల్ఫ్ దేశాలదే మెజారిటీ వాటా. ఈ దేశాల నుంచి వచ్చే ముడి చమురు హొర్ముజ్ జలసంధి మీదుగానే వస్తున్నది. అయితే ఇరాన్ దాడులతో నౌకా రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇక ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేస్తామంటూ చేసిన ప్రకటన బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేటును 70 డాలర్ల నుంచి 80 డాలర్లకు తీసుకెళ్లింది. ఫలితంగా భారతీయ దిగుమతులు ఆ మేరకు భారంగా మారాయి. ఇది దేశంలో ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే రిటైల్ మార్కెట్లో ధరలు ఠారెత్తిస్తున్న సంగతి విదితమే. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి అన్నింటి రేట్లూ పరుగులు పెట్టడం ఖాయం. దాంతో ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు, రుణ లభ్యత పతనం, వ్యాపార-పారిశ్రామిక రంగాల్లో ఉత్పత్తి క్షీణత.. తుదకు జీడీపీ పడిపోవడమే జరుగుతుందని ఎక్స్పర్ట్స్ గుర్తుచేస్తున్నారు. ఏడీబీ తాజా కోతలూ ఈ సంకేతాలనే ఇస్తున్నాయి మరి.
గల్ఫ్ వార్ తీవ్రతరమైతే.. దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు లేకపోలేదు. నిజానికి ఆ మధ్య గరిష్ఠ స్థాయిలకు క్రూడాయిల్ రేట్లు చేరినా.. ఆ తర్వాత అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంతో ఉద్రిక్తతలు తగ్గి ధరలూ పడిపోయాయి. అయినప్పటికీ చమురు మార్కెటింగ్ సంస్థలు.. పెంచిన ఇంధన ధరలను దించలేదు. ఇప్పటికీ రిటైల్ అమ్మకాలపై నష్టాలే వస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి మరి. ఈ క్రమంలో పశ్చిమాసియా సంక్షోభం ముదిరితే.. క్రూడాయిల్ బ్యారెల్ రేటు త్వరలోనే 100 డాలర్లను దాటేయగలదు. దానికి తగ్గట్టుగా దేశీయ మార్కెట్లోనూ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరుగవచ్చన్న అభిప్రాయాలు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రస్తుతం అనేక ప్రతికూల పరిస్థితుల ప్రభావం కనిపిస్తున్నది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ నష్టపోతుండటం, దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు తమ పెట్టుబడులను వెనుకకు తీసుకుంటుండటం, స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటం, ఎగుమతులకు అంతరాయం, విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం, ఏఐ దెబ్బకు కుదేలవుతున్న ఐటీ రంగం, విమానయానంపై ఆంక్షలు, వర్షాభావ పరిస్థితులు వంటివి జీడీపీ ప్రగతిని దెబ్బతీస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్ వార్.. భారత్ వృద్ధికున్న అవకాశాలను మరింతగా కఠినం చేస్తున్నాయని మార్కెట్ విశ్లేషకుల మాట. మిడిల్ ఈస్ట్ సంక్షోభ పరిస్థితులు దిగజారితే విదేశీ మారకం నిల్వలను కాపాడుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సైతం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చని వారంటున్నారు. ఇప్పటికే దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు పసిడి కొనుగోళ్ల అదుపునకు పిలుపునిచ్చిన మోదీ సర్కార్.. మరోవైపు విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అమ్మకాలను పెంచుతున్నది. అయితే వార్ దెబ్బకు భారత్ ఆశలన్నీ ఆవిరయ్యేలా ఉన్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను భారత జీడీపీ వృద్ధిరేటును 6.9 శాతంగా అంచనా వేశాం. అయితే అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు.. గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్ల విజృంభణకు దారితీస్తున్నాయి. అందుకే పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో దేశ ఆర్థిక ప్రగతి అంచనాను 6.6 శాతానికి పరిమితం చేస్తున్నాం. ఇక ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి రిటైల్ ద్రవ్యోల్బణం 5.2 శాతానికి పెరుగవచ్చు.
-ఆసియా అభివృద్ధి బ్యాంక్