హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో అవినీతి దందాలపై ఉకు పాదం మోపుతామని.. అక్రమారుల గురించి ధైర్యంగా సమాచారం ఇవ్వాలని సంస్థ యాజమాన్యం పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మోసగాళ్ల సమాచారాన్ని కొత్తగూడెం విజిలెన్స్ శాఖ వారి ఫోన్ నంబర్ 94911 44104కు గానీ, విజిలెన్స్ శాఖ మెయిల్ vig<\@> scclmines. comకి గానీ, ఏసీబీకి అందించాలని కోరింది. సమాచారం ఇచ్చిన వారికి పూర్తి రక్షణతో పాటు వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది.
ఆధారాలతో అక్రమారులను పట్టించిన వారికి రూ.10 వేల పారితోషకం ఇస్తామని ప్రకటించింది. బదిలీలు, కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన వారిని వైద్య పరీక్షల్లో ఫిట్ చేయించడం, డిప్యూటేషన్లు, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ పరీక్షల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సింగరేణి ఉద్యోగిని మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో సంస్థ ప్రకటన జారీ చేసింది.
అమాయకులైన కార్మికులను వంచిస్తున్న ఎవరినైనా సరే సంస్థ ఉపేక్షించబోదని, కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. గతంలోనూ సింగరేణిలో అక్రమాలకు పాల్పడిన పలువురు ఉద్యోగులపై విచారణ జరిపి డిస్మిస్ చేసిన విషయాన్ని సంస్థ గుర్తుచేసింది. చట్టప్రకారం పలువురిపై చర్యలు కూడా తీసుకున్నట్టు వెల్లడించింది. సింగరేణిని అవినీతి రహిత సంస్థగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒకరూ సహకరించాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.