హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ‘పీఎం కుసుమ్ పథకం కింద తెలంగాణకు 2024 జూన్లో 4 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్లను మంజూరు చేశాం. ఎలాంటి పురోగతి లేకపోవడంతో 6 నెలల తర్వాత దీంట్లో 3,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను రద్దుచేశాం. 2025 ఫిబ్రవరిలో ప్రభుత్వ స్థలాల్లో మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటునుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. పీఎం కుసుమ్ పథకం ప్రత్యేకించి రైతుల కోసమే రూపొందించిన పథకం. నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయొద్దు. రైతుల స్థలాల్లోనే ఏర్పాటు చేయాలని తెలంగాణకు సూచిం చాం’ అని కేంద్ర ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇటీవల వ్యాఖ్యానించారు. కానీ రద్దయిన ప్లాంట్ల ఏర్పాటుకు సైతం తెలంగాణ రెడ్కో సంస్థ రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్లాంట్ల ఏర్పాటునకు సంబంధించి రైతులు, కంపెనీల నుంచి డీడీలను కూడా పొందింది.
ఈ వ్యవహారంపై విద్యుత్తురంగ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. తొలుత పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో 4,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వశాఖ (మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యువబుల్ ఎనర్జీ) 2024 జూన్లో అనుమతి ఇచ్చింది. వీటిని రైతులు తమ సొంత స్థలాల్లోనే ఏర్పాటు చేయాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ ప్లాంట్ల ఏర్పాటులో ఎలాంటి పురోగతి లేకపోవడమే కాకుండా తీవ్ర జాప్యం చేసింది. మొత్తంగా ఏడాది గడిచిపోగా, ఈలోగా కేంద్రం ఇచ్చిన గడువు కూడా ముగిసిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 3,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ను కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా ఈ ఏడాదికి వెయ్యి మెగావాట్లకే కేంద్రం అనుమతినిచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యువబుల్ ఎనర్జీ పోర్టల్లోనూ తెలంగాణ వాటా 1,000 మెగావాట్లే అని చూపుతున్నది. కానీ ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 4,000 మెగావాట్లకు దరఖాస్తులను స్వీకరించింది. రద్దయిన ప్రాజెక్టుకు దరఖాస్తులు ఏంటి? అన్న అభ్యంతరాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి.
పీఎం కుసుమ్ పథకంలో వెయ్యి మెగావాట్లను మహిళా సంఘాలకు ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ స్థలాలు, ఆలయ స్థలాలను లీజుకు ఇప్పించి ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ ఇది పీఎం కుసుమ్ నిబంధనలకు విరుద్ధమని కేంద్రం తేల్చింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది. దీంతో మహిళా సంఘాలకు కేటాయించిన 1,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఈ ప్లాంట్ల ఏర్పాటులో కేంద్ర నిబంధనలు ఒకలా, రాష్ట్ర ప్రభుత్వం మరోలా వెళ్తుండటంతో ప్రతిష్ఠంభన నెలకొన్నది. ప్రైవేట్ స్థలాలను లీజుకు తీసుకోవడం సమస్యగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో మహిళా సంఘాలకు నష్టం కలుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై స్పష్టతను కోరేందుకు రెడ్కో వీసీ అండ్ ఎండీ అనీలను నమస్తే తెలంగాణ ఫోన్లో సంప్రదించగా, ఆమె స్పందించలేదు.