న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు భారీగా పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చిలో రూ.1.96 లక్షల కోట్లమేర వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైనదాంతో పోలిస్తే 10 శాతం పెరిగినట్టు తెలిపింది. అలాగే జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత రెండో అత్యధిక వసూళ్లు కూడా ఇదే కావడం విశేషం. వీటిలో దేశీయంగా జరిగిన లావాదేవీల ద్వారా రూ.1.49 లక్షల కోట్లు వసూలవగా, అలాగే దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పన్నుతో మరో రూ.46,919 కోట్లు సమకూరాయి.
జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ కింద రూ.38,145 కోట్లు వసూలు కాగా, స్టేట్ జీఎస్టీ కింద రూ.49,891 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కింద రూ.95,853 కోట్లు, సెస్ రూపంలో మరో రూ.12,253 కోట్లు సమకూరినట్టు పేర్కొంది. అలాగే రూ.19,615 కోట్లు రిఫండ్ రూపంలో చెల్లింపులు జరిపింది. ఏప్రిల్ 2024లో నమోదైన రూ.2.10 లక్షల కోట్లు ఇప్పటి వరకు ఇదే గరిష్ఠ స్థాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్ నుంచి మార్చి వరకు) రూ.22.08 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయ్యాయి.
తయారీ, వినిమయం అత్యధికంగా ఉన్న రాష్ర్టాలైన మహారాష్ట్ర, హర్యాన, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాలు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోగా..ఇతర రాష్ర్టాలైన గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాలు 1-7 శాతం మధ్యలో వృద్ధిని నమోదు చేసుకున్నాయి.