బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Oct 23, 2020 , 04:31:11

వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకం

వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకం

  • కేంద్ర ప్రభుత్వ తీరుపై ఎంపీ నామా ఆగ్రహం
  • రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్‌
  • ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపు

అశ్వారావుపేట/దమ్మపేట : కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోతుందని, ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు పూర్తిగా రైతు వ్యతిరేకమని ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులతో అన్నివర్గాల రైతులు తీవ్రంగా నష్టపోతారని, తెలంగాణ రైతులకే కాకుండా దేశంలోని రైతులందరిపైనా దాని ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు. అందుకే పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించినట్లు చెప్పారు. మెజార్టీ పేరుతో అక్రమ మార్గంలో బిల్లులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమోదింపజేశారని ఆరోపించారు.

పట్టణంలో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ పట్ల కేంద్రం మొండి వైఖరి అవలంబిస్తుందని, న్యాయంగా అందాల్సిన నిధులను కూడా కేటాయించటం లేదని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం జీఎస్టీ రూ.5 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కరోనా కష్టకాలంలో అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం.. నిర్లక్ష్య ధోరణితో పాలన సాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జాతీయ రహదారులు మరీ అధ్వాన్నంగా ఉన్నాయని, కనీసం గుంతలు పూడ్చే చర్యలు కూడా తీసుకోవటం లేదని విమర్శించారు. కేంద్రం సహకరించకున్నా సీఎం కేసీఆర్‌ ప్రజలు, రైతులకు అండగా నిలుస్తున్నారని, పల్లెల అభివృద్ధి, ప్రజలు, రైతు సంక్షేమానికే కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, తెలంగాణ ప్రభుత్వం పాలనాపరంగా తీసుకునే నిర్ణయాలు ప్రజల భవిష్యత్‌ కోసమేనని స్పష్టం చేశారు.  రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యుర్థినే గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.  అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. 

పట్టణాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం :   ఎంపీ నామా, ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి : తెలంగాణ ప్రభుత్వంలో పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు అన్నారు. గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో రూ.1.19కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయిన్లకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీలోని అన్ని అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా మార్చేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ఇప్పటికే పట్టణంలోని అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా మార్చామని, మిగిలిన వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైయిన్లకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్‌, ఐటీశాఖా మంత్రి కేటీఆర్‌ సారథ్యంలో పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ తోట సుజలారాణి, ఆత్మ చైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కమిషనర్‌ సుజాత, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్‌రావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, డీసీసీబీ డైరెక్టర్‌ చల్లగుళ్ల కృష్ణయ్య, రైతుబంధు కన్వీనర్‌ గాదె సత్యం, సొసైటీ అధ్యక్షులు తుమ్మూరు శ్రీరామప్రసాద్‌, చిలుకుర్తి కృష్ణమూర్తి, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీను, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.