బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Feb 01, 2020 , 23:34:37

బాధ్యతల స్వీకరణ..

బాధ్యతల స్వీకరణ..
  • సత్తుపల్లి, ఇల్లెందు చైర్మన్లుగా మహేశ్‌, వెంకటేశ్వరరావు
  • హాజరైన ఎమ్మెల్యేలు హరిప్రియ, సండ్ర
  • అట్టహాసంగా జరిగిన కార్యక్రమం

ఇల్లెందు, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 1: ‘ప్రజలు కోరుకున్న పాలన ఇద్దాం.. మిగతా మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉందాం. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని సుపరిపాలనకు శ్రీకారం చుడదాం. కౌన్సిల్‌ సభ్యులంతా ప్రజలందరికీ చేరువకావాలి. ఎక్కడా దర్పం, దర్జా కనపడకూడదు. కేసీఆర్‌ కోరుకునేదీ అదే. సమస్య వస్తే వెంటనే పరిష్కరించాలి. అవసరమైతే నా దృష్టికి తీసుకురండి.’ అంటూ ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియనాయక్‌ సూచించారు. ఇల్లెందు మున్సిపల్‌ నూతన పాలకవర్గ సభ్యుల శనివారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎమ్మెల్యే ప్రసంగించారు.ప్రజలే న్యాయ నిర్ణేతలని, అందుకే టీఆర్‌ఎస్‌కు బ్రహ్మాండమైన మెజార్టీని కట్టబెట్టారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదర్శమైన పాలనను చూసి ప్రజలు మనకు ఈ అవకాశాన్ని ఇచ్చారన్నారు. సీఎం కేసీఆర్‌ పరిపాలన యావత్‌ దేశానికే ఆదర్శమని అన్నారు. మిగతా రాష్ట్రాలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయంటే కేసీఆర్‌ సుపరిపాలనేంటో అర్థమవుతున్నదని అన్నారు. 


కాంగ్రెస్‌, బీజేపీ వంటి జాతీయ పార్టీలు మున్సిపల్‌ ఎన్నికల్లో మట్టికరిచాయంటే కేసీఆర్‌ పరిపాలనే కారణమని గుర్తుచేశారు. మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే కౌన్సిలర్‌ విధి అన్నారు. పాలకవర్గం ప్రజలకు చేరువయ్యే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పుడు బాధ్యతలు చేపడుతున్న మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. రిజర్వేషన్లు ఎలా ఉన్నా మరోమారు అవకాశం దక్కే విధంగా ప్రజలు కోరుకునే పాలనను అందించాలన్నారు. వారి పాలన ఆధారంగానే వారి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఇది చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌తోపాటు కౌన్సిలర్లందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు చెబుతున్నానని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. పాలకవర్గంతో పరిష్కారం కాని సమస్యలను ఇల్లెందు ప్రజాప్రతినిధిగా తాను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. 


స్ఫూర్తిదాయక పాలన అందిద్దాం: డీవీ 

స్ఫూర్తిదాయక పాలనను అందిద్దామని నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇల్లెందు మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు (డీవీ) పేర్కొన్నారు. శనివారం పండుగ వాతావరణంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. తొలుత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి బైక్‌ ర్యాలీగా మున్సిపల్‌ కార్యాలయానికి తరలివెళ్లారు. జగదాంబసెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. వేదపండితులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే, డీవీ, ఇతర కౌన్సిలర్లకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. 


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుంటూ స్ఫూర్తిదాయక పాలనను అందిద్దామని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు సమష్టిగా కృషి చేయాలని కోరారు. 24 వార్డుల్లో ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు పాలకవర్గం ఉంటుందని, అవసరమైతే ఎమ్మెల్యే సహకారం తీసుకుందామని అన్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, రాష్ట్ర రైతు సమన్వయ సమితి సలహాదారు పులిగళ్ల మాధవరావు, టీఆర్‌ఎస్‌ నాయకులు బానోత్‌ హరిసింగ్‌నాయక్‌, సుధీర్‌తోత్లా, రంగనాథ్‌, ఇల్లెందు మున్సిపల్‌ కమిషనర్‌ విజయ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.