YS Viveka Murder Case | హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను సీబీఐ సాక్షిగా చేర్చింది. ఆమెను 259 సాక్షిగా పేర్కొంటూ సీబీఐ కోర్టుకు వాంగ్మూలాలు సమర్పించింది. కోర్టు విచారణకు స్వీకరించడంతో ఈ వివరా లు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. తన వద్ద ఆధారాలు లేవు గానీ, రాజకీయ కారణంగానే హత్య జరిగిందని షర్మిల భావిస్తున్నట్టు వాంగ్మూలం ఇచ్చారని సీబీఐ కోర్టుకు పేర్కొన్నది.
హత్యకు కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు కారణం కాదని, పెద్ద కారణం ఉండొచ్చని చెప్పారని, అవినాశ్ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే కారణం కావొచ్చని, వారికి అడ్డుస్తున్నారని మనసులో పెట్టుకొని ఉండొచ్చని పేర్కొన్నారని తెలిపింది. హత్యకు కొన్ని నెలల ముందు బెంగళూరులోని తమ ఇంటికి వివేకా వచ్చారని, కడప ఎంపీగా పోటీ చేయాలని తనను అడిగారని, అవినాశ్‌కు టికెట్ ఇవ్వకుండా ఎలాగైనా జగన్‌ను ఒప్పిద్దామన్నాని చెప్పారని వాంగ్మూలంలో పేర్కొన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా తాను వెళ్లనని వివేకా ఆలోచించారని, తనకు జగన్ మద్దతు ఇవ్వరని తెలుసు కాబట్టి ఎంపీగా పోటీకి మొదట ఒప్పుకోలేదని, బాబాయ్ ఒత్తిడి మేరకు అంగీకరించినట్టు వెల్లడించారు.
ఎంపీగా వివేకానే పోటీ చేయకుండా మీపై ఎందుకు ఒత్తిడి తెచ్చారని సీబీఐ ప్రశ్నించగా, బహుశా ఎమ్మెల్సీగా ఓడిపోయినందున ఆసక్తి చూపకపోయి ఉండొచ్చని, విజయమ్మపై పోటీ చేశాక కొంత దూరం పెరిగిందని చెప్పారు. ఆ కారణంగా ఎలాంటి టికెట్ దక్కకపోవచ్చని వివేకా భావించారని, ఎమ్మెల్సీగా ఆయన ఓటమికి తనకు తెలిసినంత వరకు అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, కొందరు సన్నిహితులే కారణమని పేర్కొన్నారు. కుటుంబంలో అంతా బాగున్నట్టు కనిపించినా.. లోపల కోల్డ్‌వార్ ఉండేది.. అని షర్మిల వాంగ్మూలం ఇచ్చినట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో వైఎస్ షర్మిల నుంచి సీఎం జగన్ అటెండర్ నవీన్‌ను కలిపి మొత్తం 259 మంది వాంగ్మూలాలను సీబీఐ సేకరించింది. నిరుడు అక్టోబర్ 7న ఢిల్లీలో వైఎస్ షర్మిల వాంగ్మూలం తీసుకున్నది. వాటిని గత నెల కోర్టుకు అందజేసింది. వివేకా హత్య కేసులో సీఎం జగన్ ఓఎస్డీ పీ కృష్ణమోహన్‌రెడ్డి, విశ్రాంత సీఎస్ అజేయ కల్లం, వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ అటెండర్ గోపరాజు నవీన్‌కుమార్ సాక్షులుగా ఉన్నట్టు కోర్టుకు తెలిపింది.