YS Sharmila | ప్రముఖ వ్యాపారవేత్త అదానీతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అక్రమ డీల్‌తో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం రూ.1.50 లక్షల కోట్లు అని.. ఈ డీల్‌ను వెంటనే రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి సుదీర్ఘ లేఖను రాశారు.
అదానీతో షర్మిల చేసుకున్నది అక్రమ ఒప్పందం అని షర్మిల ఆరోపించారు. దీనివల్ల 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం 1.50 లక్షల కోట్లు అని అన్నారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ కొనుగోళ్ల విషయంలో లంచాలు తీసుకున్నట్లు ఇప్పటికే అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థలు నిరూపించాయి. స్కీంల కోసం స్కాంలకు పాల్పడ్డట్లు ఆధారాలు సైతం చూపించాయి. అదానీకి చెందిన గ్రీన్ ఎనర్జీ కంపెనీతో 2021లో గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆండ్ కో కి రూ.1750కోట్లు నేరుగా లంచాలు ముట్టినట్లు అమెరికా కోర్ట్ లో తీవ్ర అభియోగాలు మోపబడ్డాయి. దిగ్గజ వ్యాపారవేత్తగా అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర పరువును తీశారు. తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీశారు. లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత నష్టాల్లోకి నెట్టారు. అదానీ, జగన్ మోహన్ రెడ్డి మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలు మొత్తం రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను దోచుకొనే భారీ కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
అదానీతో ఒప్పందం రాష్ట్రానికి పెనుభారం
సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అదానీతో గత ప్రభుత్వం 25ఏళ్లకు గాను ఒప్పందం చేసుకుంది. 2021 డిసెంబర్ 1న 7వేల మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఒప్పందాలు జరిగాయని, రాష్ట్రంలో రైతుల కోసం ఈ విద్యుత్ ను వినియోగించనున్నట్లు అప్పుడు ప్రకటించుకున్నారు. ఇది అత్యంత కారుచౌక అని, విద్యుత్ కొనుగోళ్లలో వైసీపీ ప్రభుత్వం సాధించిన విజయంగా గొప్పలు చెప్పుకున్నారు. కానీ అదానీ దగ్గర నుంచి గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర రూ.1.99పైసలకు కొంటుంటే, అంధప్రదేశ్ రాష్ట్రం మాత్రం యూనిట్ ధర రూ.2.49 పైసలుగా అగ్రిమెంట్ చేసుకున్నారు. గుజరాత్ కంటే 50పైసలు ఎక్కువ పెట్టి కొన్నారు. ఈ ఒప్పందం సమయంలో విద్యుత్ సరఫరాకు అదనపు చార్జీల భారం ఉండదని చెప్పారు. కానీ తెలిసిన విషయం ఏంటంటే, ట్రాన్స్మిషన్ చార్జీలతో పాటూ అదానీ పవర్ రాష్ట్రానికి చేరే సరికి ఇతర చార్జీలు కలుపుకొని యూనిట్ ధర 5 రూపాయల కంటే ఎక్కువగా పడుతుంది. ఎక్కువ రేటు పెట్టి సోలార్ పవర్ కొన్నందుకు గాను 25ఏళ్లకు రాష్ట్ర ప్రజలపై పడే భారం అక్షరాల లక్ష కోట్లు. ట్రాన్స్మిషన్ చార్జీల భారం అదనంగా మరో 50వేల కోట్లు. అంటే అదానీతో జగన్ మోహన్ రెడ్డి గారు రూ.1750కోట్ల లంచాలకు ఆశపడి చేసుకున్న ఒప్పందానికి రాష్ట్రం నెత్తిన పడే భారం రూ.1.50లక్షల కోట్లు. ఇదంతా అదానీకి దోచిపెట్టే కుట్ర కాకపోతే మరేంటి..? ఈ లక్షా 50వేల కోట్ల రూపాయల దోపిడీలో జగన్ గారికి ముట్టే వాటాలు ఎంత? ఇదంతా తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సర్దుబాటు చార్జీల పేరుతో రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.17వేల కోట్ల భారం మోపారు. దీనికి అదనంగా అదానీతో చేసుకున్న అక్రమ ఒప్పందాలకు ప్రతి ఏటా రూ.5వేల కోట్ల భారం పడనుంది.
అర్ధరాత్రి అనుమతుల వెనుక దర్యాప్తు జరగాలి
అదానీతో చేసుకున్న విద్యుత్ కోనుగోళ్ల ఒప్పందాలు మొత్తం సీఎంవో నుంచే నడిచాయి. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి విద్యుత్ శాఖ మంత్రి ఒప్పుకున్నారు. పిలిచి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టానని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అదానీని కలిసిన తెల్లవారే సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వచ్చింది. అదానీ తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చేందుకు ఒప్పుకున్నారని, గ్రీన్ ఎనర్జీ కంపెనీతో ఒప్పందం చేసుకోవాలని సెకీ కోరగా, ఉన్నఫలంగా అన్ని పనులు పక్కన పెట్టి, మరునాడే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం పెట్టారు. అదానీతో ఒప్పందాలను ఆమోదిస్తూ అప్పటి వరకు చేసుకున్న అగ్రిమెంట్లు అన్ని రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా ఎటువంటి ప్రజాభిప్రాయం సేకరించకుండా, అదే కంపెనీ ఇతర రాష్ట్రాల్లో చేసుకున్న ఒప్పందాలను పరిశీలించకుండా వెంటనే ఆమోదముద్ర వేశారు. ఆర్థిక, విద్యుత్ శాఖలు సైతం ఒప్పంద దస్త్రానికి అనుమతులు ఇచ్చేందుకు అర్ధరాత్రి వరకు పని చేశారని, కేవలం 7గంటల్లోనే అన్ని రకాల క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇచ్చారని పత్రికల కథనాల ద్వారా చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డికి ఏ స్వలాభం లేకుంటే, రూ.1750కోట్ల లంచాలు తీసుకోకుంటే, ఇంత హుటాహుటిన సోలార్ పవర్ ను కొనాల్సిన అవసరం ఏమొచ్చిందో, నిజనిజాలు ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలియాలి.
అదానీతో ఒప్పందాల రద్దుతో పాటూ, కంపెనీని తక్షణమే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి.
విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేయాలి. అలాగే 2019 నుంచి 2024మధ్య అదానీతో జరిగిన ఒప్పందాల మీద పూర్తిగా విచారణ జరగాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో రాష్ట్రాన్ని అదానీ గ్రూప్స్ కి బ్లాంక్ చెక్ లా రాసి ఇచ్చారు. నేల, నీరు, నింగి, ఖనిజం ఇలా అన్ని సహజ వనరులను అదానీకి దోచి పెట్టారు. అదానీ కన్ను పడితే కాదనకుండా సర్వం దోచిపెట్టారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కోసం అదానీ కంపెనీకి లక్షల ఎకరాలను ధారాదత్తం చేశారు. జలవిద్యుత్ తయారీ కోసం అంటూ రాష్ట్రంలో సాగునీటి రిజర్వాయర్లను కూడా రాసి ఇచ్చారు. లక్షల మందికి ఉద్యోగాల కల్పన పేరు చెప్పి రాష్ట్రాన్ని అదానీకి కట్టబెట్టారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అదానీ కంపెనీ నుంచి జగన్ మోహన్ రెడ్డికి వేల కోట్లు ముడుపులు ముట్టాయి తప్పా .. ఏ ఒక్కరికి ఒక్క ఉద్యోగం రాలేదు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని దోచుకోవాలని చూసిన అదానీ గ్రూప్స్ కి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అర్హత లేదు. అదానీ కంపెనీని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ లిస్ట్ కంపెనీగా పరిగణించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
అదానీకి చెక్ పెడతారా లేక మీరు అంటకాగుతారా..?
విద్యుత్ కొనుగోళ్ల ద్వారా లబ్ధి పొందేందుకు అదానీ కంపెనీ ఏకంగా రూ.1750కోట్ల లంచం మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఇచ్చినట్లు ప్రపంచం మొత్తం దుమ్మెత్తి పోస్తుంది. మన దేశం, రాష్ట్రం పరువు తీసేలా అంతర్జాతీయ మార్కెట్లో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా మీ కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. ముడుపుల అంశంలో కనీసం మీరు నోరువిప్పడం లేదు. అంటే అదానీ మీకు కూడా ఆఫర్లు పెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ ప్రాజెక్ట్ తో పాటూ, రోప్ వే నిర్మాణం, బీచ్ శాండ్ ఉత్పత్తుల ప్రాజెక్టులు, కొత్తగా సోలార్, హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానీ కి కట్టబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం. ముడుపుల వ్యవహారంలో అదానీ కంపెనీ చేసే కుట్ర ఏంటో తేటతెల్లం అయ్యింది. రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీకి అదానీ చేసిన కుట్ర ఏంటో బహిర్గతం అయ్యింది. అమెరికా దర్యాప్తు సంస్థల ద్వారా అసలు విషయం బయటపడ్డాక మళ్లీ మీరు కూడా ఆ కంపెనీతోనే ముందుకు వెళతారా లేక రాష్ట్రంలో అదానీ గ్రూప్స్ ను బ్లాక్ లిస్ట్ లో పెడతారా తేల్చుకోవాలి.
గంగవరం పోర్టు అదానీకి అమ్మడంపైనా విచారణ జరగాలి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ . వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం గంగవరం పోర్టును నిర్మించారు. బీఓటీ అగ్రిమెంట్ కింద ఈ పోర్ట్ నిర్మాణం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 2800 ఎకరాలు పోర్ట్ కు బదలాయించారు. మొత్తం వాటాల్లో ప్రభుత్వ వాటా 10.45శాతం. 30ఏళ్ల తర్వాత తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి దక్కే విధంగా ఆనాడు ఒప్పందాలు కూడా జరిగాయి. ఈ లెక్కన 2039లో గంగవరం పోర్టు పూర్తిగా ప్రభుత్వపరం కావాల్సి ఉంది. కానీ 2021లో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న 10శాతం వాటాను అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అతి తక్కువ ధరకు అంటే రూ.640కోట్లకే పోర్టును అదానీకి కట్టబెట్టారు. 2021నాటికి పోర్టు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న వాటా ఖరీదు దాదాపు రూ.9వేలకోట్లకు పైమాటే. కానీ అత్యంత తక్కువ ధరకు అదానీకి అమ్మడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. గంగవరం పోర్టు తక్కువ ధరకు కట్టబెట్టడం వెనుక దాగి ఉన్న మర్మమేంటో కూటమి ప్రభుత్వం భయట పెట్టాలి. 2008న అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం గంగవరం పోర్ట్ తిరిగి ప్రభుత్వ పరం అయ్యేలా చర్యలు చేపట్టాలి.