అమరావతి : ఏపీ ఎన్నికల్లో టీడీపీ (TDP ) నాయకులు, కార్యకర్తలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని వైసీపీ నాయకులు ఏపీ గవర్నర్ నజీర్ (Nazeer) కు గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో పేర్నినాని, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ, కావలి మనోహర్ నాయుడు తదితరులు గవర్నర్ను కలిశారు.
పల్నాడు (Palnadu) , అనంపురం జిల్లాల్లో పోలీసుల వైఫల్యం, పోలీసు అధికారులను మార్చిన చోటే హింస జరగడాన్ని గవర్నర్కు వివరించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ దీపక్ మిశ్రా పక్షపాత వైఖరిని అవలంభించారని అన్నారు.
టీడీపీ నేతల సూచనలకు అనుగుణంగా మిశ్రా పనిచేశారని పేర్కొన్నారు. దీపక్ మిశ్రాను తప్పించాలని కోరాం. టీడీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారని, అతడిపై న్యాయ విచారణ చేయాలని కోరారు. రాష్ట్రంలో హింస జరుగుతున్న ప్రాంతాల వారితో సీఎం జగన్ ఇప్పటికే మాట్లాడారని పేర్కొన్నారు.