‘హే బల్వంత్’ చిత్రానికి అన్ని కేంద్రాల్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, తెలుగు రాష్ర్టాల్లో ప్రీమియర్స్ అన్నీ ఫుల్ అయ్యాయని, ఒత్తిడిలో ఉన్నవారికి ఓ మెడిసిన్‌లా మనసును తేలికపరిచే చిత్రమిదని చెప్పారు నిర్మాత వంశీ నందిపాటి. ఆయన బన్నీవాసుతో కలిసి థియేట్రికల్ రిలీజ్ చేసిన చిత్రం ‘హే బల్వంత్’. సుహాస్, శివానీ నాగారం జంటగా గోపి అచ్చర దర్శకత్వంలో నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.
ఫ్యామిలీస్‌తో కలిసి అనందించే చిత్రమిదని, బ్లాక్‌బస్టర్ హిట్ గ్యారంటీ అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ రావడం ఆనందంగా ఉందని నిర్మాత నరేంద్ర రెడ్డి అన్నారు. నవ్వులతో థియేటర్లన్నీ ఊగిపోతున్నాయని, తన కెరీర్లో ఈ స్థాయి స్పందన ఎప్పుడూ చూడలేదని, ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయని సీనియర్ హీరో నరేష్ తెలిపారు. తన కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయని హీరో సుహాస్ చెప్పారు. ఈ సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఎంజాయ్ చేయాలని కథానాయిక శివానీ నాగారం కోరింది.