Kakani Govardhan Reddy | జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ద్వారా పదవులు వస్తాయని పలువురు నేతలు పోటీ పడి మరీ నోరు పారేసుకుంటున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. జగన్ కాలిగోటికి సరిపోని వారు కూడా ఆయన్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి విమర్శల స్థాయి గుర్తించాల్సిన ఉందని పేర్కొన్నారు.
నెల్లూరులో కాకాణి గోవర్దన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వంపై రైతులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ నిరసనతో అర్థమైందని అన్నారు. ఇటీవల జరిగిన రైతు ఉద్యమాన్ని ప్రభుత్వం పోలీసులు అడ్డంపెట్టి నీరుగార్చాలని చూసిందని తెలిపారు. ప్రతిచోట నోటీసులు జారీ చేయడం, హౌస్ అరెస్టులు విధించడం, కేవలం 15 మందితోనే ర్యాలీ నిర్వహించాలన్న నియమాలను కఠినంగా అమలు చేయడం ద్వారా నిరసనకు అడ్డంకులు వేయాలని ప్రయత్నించారని విమర్శించారు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి 1.29 గంటలకు వాట్సాప్ ద్వారా మొబైల్కు నోటీసులు పంపించారని అన్నారు.
రైతు సమస్యలపై దృష్టి పెట్టకపోవడం, ప్రభుత్వ బాధ్యతల్లో లోపమని కాకాణి అన్నారు. నెల్లూరు జిల్లాలో అక్రమంగా గ్రావెల్ మైనింగ్, భూ కబ్జాలు మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు. ఏపీఐఐసీ భూములను అక్రమంగా కబ్జా చేసి సిలికాన్ తవ్వకాలను చేపడుతున్నారని అన్నారు.