YS Jagan | ఏపీలోని కూటమి ప్రభుత్వంపై, సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన అన్యాయంగా సాగుతోందని విమర్శించారు. దేవుడు అన్ని చూస్తున్నాడని.. కళ్లు మూసుకుని తెరిచేలోపు మన ప్రభుత్వం వస్తుందంటూ వ్యాఖ్యానించారు.
నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను వైఎస్ జగన్ పరిశీలించారు. స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం హయాంలో రూ.26వేల కోట్లతో పోర్టుల అభివృద్దికి అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. రాష్ట్రంలో నాలుగు కొత్త పోర్టులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కృషి చేశామన్నారు. అన్ని రకాల అనుమతులతో పోర్టులను ప్రారంభించామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కడుతున్న 10 ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొత్తు✊🏻
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు#ChaloJuvvaladinne#SadistChandraBabu pic.twitter.com/o9L8luMnKY
— YSR Congress Party (@YSRCParty) April 15, 2026
2024 మార్చి 12న జువ్వలదిన్నెను వర్చువల్‌గా ప్రారంభించామని జగన్ చెప్పారు. 1250 మెకానైజ్డ్ బోట్లు అందించాలని అనుకున్నామని.. మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ బోట్లు మత్స్యకారులకు అందేవే అని చెప్పారు. మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు కూడా 35 శాతం పూర్తి చేశామని తెలిపారు. కాకినాడ పోర్టు పనులు కూడా వేగవంతం చేశామని అన్నారు. రామాయపట్నం పోర్టు పనులు కూడా దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. ఏపీ ఎకనామిక్ గ్రోత్‌కు ఊతం ఇచ్చేలా ప్రణాళికలు చేశామని వివరించారు. మరి మిగిలిన పనులను కూటమి సర్కార్ ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యి రెండేళ్లు అవుతుందని.. ప్రధాని జాతికి అంకితమిచ్చి ఏడాదిన్నరకు పైగా అవుతుందని.. అయినా మత్స్యకారులు ఎందుకు అప్పగించలేదని నిలదీశారు.
మత్స్యకారుల గురించి చంద్రాబు ఏనాడూ ఆలోచించలేదని జగన్ విమర్శించారు. మత్స్యకారులకు మేలు చేయకపోగా.. వారి పొట్టపై కంతున్నారని తెలిపారు. జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మార్చి 12న మంత్రి నారా లోకేశ్ జువ్వలదిన్నెను సందర్శిస్తే.. 16న సీజ్ చేసిన బోట్లు ఎత్తుకెళ్లిపోయారని తెలిపారు. బోట్లు ఎత్తుకెళ్లిన కేసులో ఒక్కరినైనా అరెస్టు చేశారా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న పెద్దలే దొంగతనం చేశారు కాబట్టే ఎవర్ని అరెస్టు చేయలేదని ఆరోపించారు. మత్స్యకారుల కడుపు కొట్టేందుకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే ఏకమవుతున్నారని అన్నారు. బోట్లు ఎత్తుకెళ్లేవారికి సీఎం కొడుకు ఆశీర్వాదాలు ఉన్నాయని అన్నారు.
కళ్లు మూసి తెరిచేలోగా మూడేళ్లు గడిచిపోతాయని.. ఆ తర్వాత వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని జగన్ తెలిపారు. అధికారంలోకి రాగానే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తామని హామీ ఇచ్చారు. జువ్వలదిన్నె మాత్రమే కాదు 10 ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొంతమని తెలిపారు. ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు అని.. హార్బర్లను మత్స్యకారుల నుంచి చంద్రబాబు తాత కూడా తీయలేడని స్పష్టం చేశారు.