AP News | పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వోన్నత న్యాయస్థానంలో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు కొద్ది గంటల ముందు వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.
పోస్టల్ బ్యాలెట్లపై అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్‌తో ఆమోదించాలని ఇటీవల ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్ 13 ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధంగా ఉన్నాయని వైసీపీ ఆరోపించింది. ఏ రాష్ట్రంలో లేని ప్రత్యేక నిబంధన ఏపీలోనే ఎందుకని ప్రశ్నించింది. దీనిపై ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వేయాలని అనుబంధ పిటిషన్ కూడా వేశారు. దీనిపై వాదనలు విన్న జస్టిస్ కిరణ్మయి ధర్మాసనం.. సీఈసీ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.