అమరావతి : విశాఖ స్టీల్‌ప్లాంట్ (steel plant ) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. అధికారంలోకి రాకముందు ఒకమాట, వచ్చిన తరువాత మరో మాట మాట్లాడడం టీడీపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మాజీ మంత్రి, వైసీపీ శాసన మండలి పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana ) ఆరోపించారు.
ప్లాంట్‌పై కూటమి నేతల వైఖరి బయట పడిందని, ప్లాంట్ కోసం కూటమి నాయకులు గతంలో దొంగ దీక్షలు చేశారని మండిపడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు ( Privatization ) వ్యతిరేకంగా వైసీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. స్టీల్ పరిరక్షణకు కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళితే తామూ వస్తామని వెల్లడించారు
. ప్రైవేటీకరణ వద్దని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ మొదటి నుంచి వ్యతిరేకమని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సమన్వయ కమిటీనీ ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. గతంలో స్టీల్ ప్రైవేటీకరణ చేయవద్దని వైఎస్ జగన్ ధైర్యంగా నరేంద్ర మోదీని కోరారని తెలిపారు.