Tirupati | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన తీవ్ర ఉత్కంఠగా మారింది. అన్య మతస్థుడు కావడంతో డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమలలో అడుగుపెట్టాలని కూటమి నేతలు, పలు హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తుంటే.. డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా తిరుపతి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్‌పై దాడి చేసేందుకు స్కెచ్ వేశారని వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కుట్ర గురించి వివరాలను తెలిపింది.
వైఎస్ జగన్ తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైఎస్ జగన్‌పై దాడికి బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి, జనసేన నేత కిరణ్ రాయల్ అలాగే ఇతర టీడీపీ నేతలు డబ్బులిచ్చి గూండాలను పురిగొలుపుతున్నారని సమాచారం అందిందని వైసీపీ ఆరోపించింది. వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి, జగన్ కాన్వాయ్‌పై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురమాయించినట్లు తెలుస్తోందని పేర్కొంది. వైఎస్ జగన్ తిరుమల పర్యటనతో శ్రీవారి లడ్డూ విషయంలో నీ బండారం బయటపడుతుందని భయపడుతున్నావా? అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించింది.
జగన్‌పై దాడికి కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని వైసీపీ చేసిన ఆరోపణలను టీడీపీ తీవ్రంగా ఖండించింది. కోడికత్తి, గులకరాయి డ్రామాల తరహాలో తమ మీద తామే దాడి చేసుకునేలా జగన్ దొంగల ముఠా ప్లాన్ చేసిందని టీడీపీ ఆరోపించింది. హిందువులు పవిత్రంగా భావించే లడ్డూలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కలిపి దొరికిపోవడంతో జగన్ దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించింది.
హిందూ దేవాలయాలపై దండయాత్రకు జగన్ ముఠా వస్తూ వస్తుందని.. భూమన, చెవిరెడ్డి లాంటి డెకాయిట్‌తో తిరుమలలో అలజడికి కుట్ర చేస్తూ ఉన్నారని టీడీపీ ఆరోపిచింది. దొంగల ముఠాను కట్టడి చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటుంటే వారిపై ఎందుకు ఏడుపులు అని మండిపడింది.