అమరావతి : పోలవరం ప్రాజెక్టు ( Polavaram Project) నిర్మాణంతో వరద ముంపును ఎదుర్కొంటున్న బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ మంత్రులు (AP Ministers) వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి రూ.3 వేలను అందించనున్నామని ప్రకటించారు.
మంత్రులు నిమ్మల రామ్మోహన్ నాయుడు(Nimmal Rammohan Naidu) , అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత(Anitha), కొలుసు పార్థసారధి , అధికారులు శనివారం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దాచారం పునరావాస కాలనీలో పర్యటించి వరద ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా పునరావాస కాలనీలోని నిర్వాసితులతో మంత్రులు భేటీ అయ్యారు. కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా తమకు ఆర్అండ్ఆర్(R and R) నిధులు జమ కాలేదని నిర్వాసితులు మంత్రులకు వివరించారు.
16 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అక్కడి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్వాసితులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. త్వరగా బయోటాయిలెట్లు (Bio -Toilets) ఏర్పాటు చేయాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు. ప్రజలకు నిజాలు తెలియాలనే శ్వేతపత్రాలు విడుదల చేశారని వెల్లడించారు. గతంలో వరదలు వస్తే వైసీపీ నేతలు పట్టించుకోలేదని ఆరోపించారు.