అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati) కి పూర్వవైభవం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వెల్లడించారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం రూ.15 వేల కోట్ల ఆర్థికసాయం ప్రకటించిందని పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలో ఎన్డీయే (NDA) శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతికి ఇంకా నిధులు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వందరోజుల్లో శ్రీసిటీలో 16 సంస్థలను ప్రారంభించామని, 6 సంస్థలకు శంకుస్థాపన చేశామని అన్నారు. బీపీఎల్ సంస్థ రాష్టంలో రూ. 75 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని వెల్లడించారు. ఎమ్మేల్యేలు, ఎంపీలు కూడా నియోజకవర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్లు రూపొందించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి 151 మంది సీట్లు ఉన్నాయని విర్రవీగిన వారు 11 సీట్లకే పరిమితమయ్యారని విమర్శించారు.
జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు చేసే మంచి పనులను గుర్తించి అండగా ఉంటామన్నారు. సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించామని తెలిపారు. సమావేశంలో బీజేపీ ఏపీశాఖ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, మూడు పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.