Vijayawada | దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైకి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రేపు ఎలాంటి వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రొటోకాల్ దర్శనాలు ఉండవని ఈవో శీనా నాయక్ ప్రకటించారు. అన్ని క్యూలైన్లు ఉచితమే అని స్పష్టం చేశారు. ప్రతి భక్తునికి ఉచితంగదా 20 గ్రాముల లడ్డూ ప్రసాదం అందజేస్తామని తెలిపారు. ఇక రేపు భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.
దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ దుర్గగుడికి భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఇవాళ సాయంత్రం 5 గంటల సమయానికి సుమారు 85 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక 10 రోజుల్లో మొత్తం 11,28,923 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఈవో వీకే శీనా నాయక్ తెలిపారు. దేవస్థానం లెక్కల ప్రకారం ఇప్పటివరకు 17,29,057 లడ్డూలు అమ్ముడుపోగా, 2,33,116 మంది అన్నప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు. ఇక చిన్నారులకు ప్రత్యేక రక్షణ చర్యగా ఇప్పటివరకు 49,597 చైల్డ్ ట్యాగ్లు అమర్చామని చెప్పారు.
ఇదిలా ఉండగా దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే హంసవాహన తెప్పోత్సవం రద్దు చేశారు. కృష్ణా నదికి భారీ వరదలు వస్తుండటంతో అమ్మవారి తెప్పోత్సవం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం హంసవాహనంపై ఉత్సవ మూర్తులతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక అర్ధరాత్రి 2 గంటల నుంచే అమ్మవారి దర్శనాలు ప్రారంభం కానున్నాయి.