Vijayawada | విజయవాడలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను ఓ భర్త నడిరోడ్డుపై భార్యను అతి కిరాతంగా కత్తితో దాడి చేసి చంపేశాడు.
ప్రాథమిక వివరాల ప్రకారం.. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన విజయ్, సరస్వతి 2022 ఫిబ్రవరి 14వ తేదీన లవ్ మ్యారేజి చేసుకున్నారు. సరస్వతి వీన్స్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తుండగా.. విజయ్.. భవానీపురం శ్రేయాస్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే సరస్వతిపై విజయ్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. కుటుంబ కలహాల నేపథ్యంలో సరస్వతి తన రెండేళ్ల కొడుకుతో విడిగా ఉంటుంది.
ఈ క్రమంలో భార్య సరస్వతిపై విజయ్ మరింత పగ పెంచుకున్నాడు. గురువారం ఉదయం భార్య ఉన్న చోటుకు విజయ్ కోపంగా వెళ్లాడు. నడిరోడ్డు మీదనే ఆమెపై కత్తితో దాడి చేశాడు. కిరాతకంగా ఆమెను పొడిచి చంపేశాడు. అంతటితో ఆగకుండా గొంతు కోశాడు. హత్య అనంతరం కూడా విజయ్ కత్తితో వీరంగం సృష్టించాడు. సరస్వతిని రక్షించేందుకు స్థానికులు వెళ్లగా వారిని కూడా బెదిరించాడు. మీకు దీని గురించి తెలియదు.. నన్ను ఆపకండంటూ విజయ్ గట్టిగా అరిచాడు. ఎవరైనా దగ్గరికి వస్తే చంపేస్తానని స్థానికులను బెదిరించాడు.