Vijayawada Durga Gudi | విజయవాడ దుర్గ గుడిలో జరిగే శ్రీచక్ర నవావరణాచర్చన పూజకు వినియోగించే పాలల్లో పురుగులు రావడం కలకలం రేపింది. ఇంద్రకీలాద్రిపై చోటుచేసుకున్న ఈ అపచారంపై ఆలయ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన వారికి మెమోలు జారీ చేశారు.
శుక్రవారం నాడు కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించిన శ్రీ చక్ర నవావరణార్చన పూజ సమయంలో పాలల్లో పురుగులు వచ్చాయి. దీంతో వెంటనే పూజను అరగంటసేపు నిలిపివేశారు. ఈ ఘటన కలకలం రేపడంతో దీనిపై దేవస్థాన స్థానాచర్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో అసిస్టెంట్ కమిషనర్, ఏఈవోలు, సూపరింటెండ్‌తో కలిసి మొత్తం ఐదుగురు సభ్యుల్ని నియమించారు. ఈ కమిటీ శ్రీ చక్ర నవావరణాచర్చన పూజ జరిపించిన ఆలయ అర్చకుల నుంచి వివరాలను అడిగి తెలుసుకుంది. ఈ క్రమంలోనే స్టోర్, పూజా విభాగాలకు చెందిన ఉద్యోగులతో పాటు సంబంధిత అర్చకుడికి నోటీసులు జారీ చేశారు. విచారణలో అభిషేకానికి వాడిన బిందె పరిశుభ్రంగా లేకపోవడమే ఈ అపచారానికి కారణమని కమిటీ నిర్ధారించింది. పురుగులు ఉన్న బిందెలోనే పాలు పోసి అర్చకుడు అభిషేకం చేసినట్లు తేలింది. అలాగే స్టోర్, పూజ విభాగాల్లోని సిబ్బంది నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా బయటపడింది.
ఈ నివేదిక ఆధారంగా శ్రీచక్ర నవావరణార్చన నిర్వహించే అర్చకుడికి ఆలయ అధికారులు మెమో జారీ చేశారు. అలాగే అతడిని అంతర్గతంగా బదిలీ చేసి.. పల్లకి సేవ, దర్బార్ సేవ, లక్ష కుంకుమార్చన పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. స్టోర్, పూజా విభాగాల ఉద్యోగులు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇక ఈ కమిటీ నివేదికను రెండు మూడు రోజుల్లో దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఆలయ ఈవో పంపించనున్నారు. ఇకపై ఆలయంలో జరిగే అన్ని అభిషేకాలు, పూజలకు గత 15 ఏళ్లుగా వాడుతున్న టెట్రా పాల ప్యాకెట్లను బంద్ చేస్తున్నట్లు ఈవో తెలిపారు. పూజలు, అభిషేకాలకు స్వచ్ఛమైన ఆవు పాలను మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు.