Mithun Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ను ఇస్తూ ఆదేశాలిచ్చింది.
రెండు ష్యూరిటీలు, రూ.2లక్షల పూచీకత్తు సమర్పించాలని ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు సూచించింది. అలాగే వారంలో రెండుసార్లు విచారణకు హాజరుకావాలని, వచ్చి సంతకాలు పెట్టాలని ఆదేశించింది. దీంతో 71 రోజులుగా జైలులో ఉన్న మిథున్ రెడ్డి రేపు ఉదయం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని ఈ ఏడాది జూలై 19వ తేదీన ఆయనను విజయవాడలోని కార్యాలయంలో దాదాపు ఏడు గంటల పాటు సిట్ అధికారులు విచారణ జరిపారు. అనంతరం అదే రోజు రాత్రి ఆయన్ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆయనకు బెయిల్ దొరకడం లేదు. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయనకు సెప్టెంబర్ 6వ తేదీన మధ్యంతర బెయిల్ దొరికింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల పాల్గొన్న అనంతరం ఇదే నెల 11వ తేదీన మళ్లీ సరెండర్ అయ్యారు. ఇప్పుడు విజయదశమికి ముందు పూర్తిస్థాయి బెయిల్ లభించడం గమనార్హం.